NTV Telugu Site icon

Rajasthan: అసెంబ్లీలో రెడ్‌ డైరీ కలకలం.. రాజస్థాన్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే సస్పెన్షన్

Rajasthan

Rajasthan

Rajasthan: రాజస్థాన్‌ అసెంబ్లీలో రెడ్‌ డైరీ కలకలం లేపింది. రెడ్‌ డైరీలో అంశాలపై చర్చించాలని పట్టుపట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రాజేంద్ర గుడాను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం రేగింది. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుడా రెడ్‌ డైరీ ప్రస్తావనను సోమవారం అసెంబ్లీలో తెచ్చారు. దీంతో సభలో కాంగ్రెస్‌ సభ్యులు ఆయనపై దాడి చేసి నెట్టేశారు. అంతేకాకుండా సభ నుంచి సస్పెండు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకూ ఆయనను సస్పెండు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదించింది. సభకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొంటూ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆయనతోపాటు భాజపా ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌నూ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండు చేశారు. గుడాకు మద్దతుగా భాజపా ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. రెడ్‌ డైరీలను చూపుతూ సభను అడ్డుకున్నారు. అంతకుముందు రెడ్‌ డైరీని సభలో గుడా ప్రదర్శించారు. ఆ తర్వాత దానిని ఎవరో దొంగిలించారని ఆరోపించారు.

Read also: West Indies ODI Squad: భారత్‌తో వన్డే సిరీస్‌.. వెస్టిండీస్ జట్టు జట్టు ప్రకటన! విధ్వంసకర ప్లేయర్ రీ ఎంట్రీ

రాజస్థాన్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌లో అవకతవకలకు సంబంధించి ఛైర్మన్‌ ధర్మేంద్ర రాఠోడ్‌ ఇంట్లో ఈడీ, ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సూచన మేరకు తాను రెడ్‌ డైరీని జాగ్రత్త పరిచానని రాజేంద్ర గుడా తెలిపారు. అశోక్‌ గెహ్లాట్‌ ఆయన కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ల సూచనల మేరకు డబ్బును ఎమ్మెల్యేలకు ఇచ్చానని రాఠోడ్‌ ఆ రెడ్‌ డైరీలో రాశారని వివరించారు. ‘ఈ డైరీని రాఠోడ్‌ రాశారు. అందులో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి పేర్లున్నాయి. సుమారు రూ.2.5 కోట్లను ఎమ్మెల్యేలకు ఇచ్చిన విషయం ఉంది. డబ్బు తీసుకున్న ఎమ్మెల్యేలకు నార్కో పరీక్ష చేయాలి. సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు తనపై దాడి చేసిన సందర్భంగా ఆ డైరీని లాక్కున్నారు. అయినా డైరీలో కొంత భాగం నా దగ్గర ఉంది. మంగళవారం పూర్తి వివరాలను వెల్లడిస్తానని రాజేంద్ర గుడా సస్పెన్షన్‌ అనంతరం సభ బయట వెల్లడించారు. కేబినెట్‌ నుంచి ఉధ్వాసనకు గురైన మంత్రి రాజేంద్రసింగ్‌ గుడా సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలపై నేరాల్లో దేశంలోనే రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. రాజస్థాన్‌ కూతుర్లు, సోదరీమణులు తనను విధాన సభకు పంపించారన్నారని, మహిళల రక్షణకు పాటుపడటానని తనకు ఓట్లువేసి గెలిపించారని చెప్పారు. రాజస్థాన్‌ మొగోళ్ల రాష్ట్రమని ఏకంగా క్యాబినెట్‌ మంత్రి శాంతి కుమార్‌ ధరివాల్‌ ప్రకటించినప్పుడు తప్పులేనిది.. మహిళ భద్రత గురించి తాను మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని రాజేంద్రసింగ్‌ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో గంటల వ్యవధిలోనే ఆయనను సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే.