Site icon NTV Telugu

Agnipath: అగ్నిపథ్ నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు

Tri Services On Agnipath

Tri Services On Agnipath

భారత్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశంగా అగ్నిపథ్ నిలిచింది. ఈ స్కీమ్‌పై దేశంలో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అగ్నిపథ్​​పథకం కింద నియమించే సైనిక నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. విద్యార్హతలు, పరీక్ష సిలబస్‌, వైద్యప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. రిక్రూట్‌మెంట్లపై సవివర షెడ్యూల్‌ విడుదల చేశారు.

రక్షణ మంత్రిత్వశాఖలోని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ నియామకం గురించిన వివరాలను వెల్లడించారు. త్రివిధ దళాల నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని.. ఇంతకుముందు జరిగిన రీతిలోనే ఇది సాగుతుందన్నారు. అత్యుత్తమ నైపుణ్యాలను ఆకర్షించేందుకు అగ్నిపథ్‌ను తెచ్చామని.. ఇది సైనిక దళాలకు అదనపు బలమవుతుందని అని అనిల్‌ పురీ వెల్లడించారు. ‘అగ్నివీరులు’గా నియమితులయ్యేవారు సాహస పురస్కారాలకూ అర్హులేనని తెలిపారు. అగ్నిపథ్‌ కింద ఆర్మీలో మహిళలకూ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అగ్నిపథ్‌ కింద త్రివిధ దళాల్లో చేపట్టయే నియామక ప్రక్రియపై సవివర షెడ్యూల్‌ను త్రివిధ దళాల ఉన్నతాధికారులు విడుదల చేశారు.

సైన్యంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ జులై 1 నుంచి మొదలవుతుంది. నియామక ర్యాలీలు ఆగస్టు రెండో వారం నుంచి ఆరంభమవుతాయి. మొదటి బ్యాచ్‌ అగ్నివీరుల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష అక్టోబరు 16, నవంబరు 13 తేదీల్లో జరుగనుంది. ఎంపికైనవారు డిసెంబరు 22న శిక్షణ కేంద్రాల్లో చేరాలి. వీరు శిక్షణ పూర్తిచేసుకొని, వచ్చే ఏడాది జులై 23న సంబంధిత యూనిట్లలో విధుల్లో చేరతారు. రెండో బ్యాచ్‌కి ఉమ్మడి ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 23న జరుగుతుంది. ఎంపికైనవారు ఫిబ్రవరి 23న సైనిక శిక్షణ కేంద్రంలో చేరాలి. ఆశావహుల సందేహాలను తీర్చడానికి అగ్నివీర్‌ హెల్ప్‌లైన్‌ను కూడా సైన్యం ప్రారంభించింది.

వైమానిక దళంలో అభ్యర్థుల నమోదు ప్రక్రియ జూన్‌ 24 నుంచి జులై 5 వరకూ జరుగుతుంది. రిజిస్ట్రేషన్‌ జులై 24 నుంచి 31 వరకూ ఉంటుంది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 10 కల్లా కాల్‌లెటర్లు జారీ అవుతాయి. వారికి ఆగస్టు 29 నుంచి నవంబరు 8 మధ్య వైద్య పరీక్షలు జరుగుతాయి. ప్రాథమికంగా ఎంపికైన వారితో కూడిన జాబితాను డిసెంబరు 1న విడుదల చేస్తారు. ఎంపికైన వారికి డిసెంబరు 11న కాల్‌ లెటర్లు పంపిస్తారు. అదే నెల 30న శిక్షణ ప్రారంభమవుతుంది. మొదటి సంవత్సరంలో రెండు శాతం మంది అగ్నివీరులను నియమిస్తారు. ఐదో సంవత్సరం కల్లా ఈ సంఖ్య 6వేలకు చేరుతుంది.

నౌకాదళంలో చేరాలనుకునేవారికి సంబంధించి నమోదు ప్రక్రియ వివరాలు నేడు వెలువడనున్నాయి. నమోదు జులై 1 నుంచి ప్రారంభమవుతుంది. సవివర నోటిఫికేషన్‌ జులైలో ప్రచురితమవుతుంది. అదే నెల 15 నుంచి 30 వరకూ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. రాత, దేహదారుఢ్య పరీక్షలు అక్టోబరు మధ్యలో జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులకు నవంబరు 21 నుంచి శిక్షణ మొదలవుతుంది. నౌకాదళంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులు మర్చంట్‌ నేవీలో చేరవచ్చు.

Exit mobile version