
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి భయానకంగా మారింది. రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇంకా భయం వెంటాడుతూనే ఉన్నది. పైగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఇబ్బందులు పెడుతున్నది. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ అందించాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తగినన్ని వ్యాక్సిన్ సరఫరా కాకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ నిర్వహించినా వ్యాక్సిన్ లేమి కారణంగా అరకొరగా మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. వ్యాక్సిన్ కొరతకు కారణం ఏంటి? దేశంలో ఎందుకు వ్యాక్సిన్ కొరత ఏర్పడింది?
సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరైన తరువాత మొదటిలో సుమారుగా 5 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేసింది. అయితే, అంతకు మించి నిల్వచేసే సామర్ధ్యం లేకపోవడంతో ఎక్కడ నిల్వచేయాలో తెలియని పరిస్థితిల్లో ఉత్పత్తిని నిలిపివేయడం, మనదేశం నుంచి విదేశాలు పెద్ద ఎత్తున కేంద్రం వ్యాక్సిన్ ను సరఫరా చేయడంతోనే వ్యాక్సిన్ కు దేశంలో కొరత ఏర్పడిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సెకండ్ వేవ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో దానికి తగిన విధంగా వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే, ప్రస్తుతం దేశంలో మూడో వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు కావడంతో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను ఇండియాలో ఉత్పత్తి చేయడం మొదలు పెట్టబోతున్నారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యాక్సిన్ కొరత కొంతమేర తగ్గవచ్చని నిపుణులు చెప్తున్నారు. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు నిండినవారికి వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందరికి వ్యాక్సిన్ అందించాలి అంటే నిత్యం కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి కావాలి. మరి అవసరానికి తగిన విధంగా దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతుందా? చూడాలి.