NTV Telugu Site icon

RBI: రూ. 20,000 నగదు రుణాల పరిమితిని పాటించాలి.. నాన్-బ్యాంక్స్‌కి ఆర్బీఐ ఆదేశం..?

Rbi

Rbi

RBI: నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు(NBFC) రూ. 20,000 నగదు రుణాల పరిమితిని ఖచ్చితంగా పాటించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కోరినట్లు సమచారం. నగదు లావాదేవీలను పరిమితం చేసేందుకు ఆర్బీఐ ఈ చర్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 269SS నిబంధనల ప్రకారం, ఏ వ్యక్తి కూడా రూ. 20,000 కంటే ఎక్కువ రుణ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించకూడదని నిర్దేశిస్తుందని ఆర్బీఐ ఒక లేఖలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని తెలుస్తోంది.

Read Also: Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోనున్న చిరు..ఎప్పుడంటే?

ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఏ నాన్-బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ కూడా రూ. 20,000 కంటే ఎక్కువ లోన్ మొత్తాన్ని నగదు రూపంలో పంపిణీ చేయడానికి వీల్లేదు. నాన్-బ్యాంక్ రుణదాత IIFL ఫైనాన్స్‌పై చర్య తీసుకున్న ఆర్బీఐ ఈ లేఖను పంపినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ అనేక నిబంధనలను ఉల్లంఘించి, చట్టబద్ధమైన పరిమితికి మించి నగదు చెల్లింపు, వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ వార్తల్ని ఆర్బీఐ అధికారికంగా ధృవీకరించలేదు. ఇలాంటి ఆదేశాలపై ఆర్బీఐ ఇప్పటి వరకు స్పందించలేదు.