NTV Telugu Site icon

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారి అరెస్ట్.. ఎవరు ఈ “రవి అత్రి”..

Neet

Neet

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్‌లో సూత్రధారిగా ఉన్న రవి అత్రిని ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసన చేస్తున్న సమయంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని నీమ్కా గ్రామానికి చెందిన అత్రి, వైద్య విద్యలో అత్యంత పోటీ పరీక్ష అయిన నీట్ వ్యవహారంపై నీలినీడలు కమ్ముకునేలా చేశాడు.

నీట్-యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడంతో వివాదం మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొన్ని కేంద్రాలలో పేపర్ పంపిణీలో తప్పు ప్రశ్న మరియు లాజిస్టికల్ జాప్యం కారణంగా గ్రేస్ మార్కులు ఇవ్వడానికి కారణమని పేర్కొంది. అయితే, బీహార్ పోలీసులు జరిపిన విచారణలో కొందరు అభ్యర్థుల కోసం పేపర్ లీక్ అయినట్లు తేలింది.

Read Also: Delhi: నీటి సంక్షోభంపై అతిషి నిరాహాదీక్ష .. సీఎం కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా బీజేపీ నినాదాలు..

దాదాపుగా 24 లక్షల మంది ఔత్సాహిక వైద్య విద్యార్థుల కోసం NEET-UG పరీక్షను మే 5న నిర్వహించారు. అయితే, నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా రవి అత్రి ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీకుల్లో కూడా ఇతని ప్రమేయం ఉంది. సాల్వ్ చేసిన ప్రశ్నాపత్రాన్ని ‘సాల్వర్ గ్యాంగ్’ పేరుతో పిలువబడే నెట్వర్క్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో అప్లోడ్ చేస్తుంది. 2012లో మెడికల్ ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో అత్రిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నీట్ వ్యవహారంలో బీహార్ పోలీసులు సంబంధం ఉన్న అనేక మందిని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో అత్రితో ఉన్న సంబంధాలు బయటపడటంతో అతడిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2007లో అత్రిని అతని కుటుంబం వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి రాజస్థాన్ కొటకు పంపింది. అతను 2012లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పీజీఐ రోహ్‌తక్‌లో అడ్మిషన్ పొందాడు. కానీ 4వ సంవత్సరంలో పరీక్షలకు హాజరుకాలేదు. అప్పటి నుంచి ఎగ్జామ్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నాడు. పరీక్షల సమయంలో ఇతర అభ్యర్థుల తరుపున పరీక్ష రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లీకైన పేపర్లను విద్యార్థులకు సర్క్యులేట్ చేయడంలో కూడా ఇతని పాత్ర ఉంది.