రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ఆసక్తి నెలకొంది. గత ఐదేళ్లలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 200కు పైగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో అవన్నీ చట్టాలుగా మారాయి. అయితే వాటిలో చాలా వరకు ఇంకా అమల్లోకి రాకపోవటం గమనార్హం. ఆయా చట్టాల అమలుకు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించకపోవటమే దీనికి కారణం. మరోవైపు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఐదేళ్ల కాలంలో ఆరు క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపినవాటిలో 159 బిల్లులకు ఆమోదముద్ర వేశారు.
తమిళనాడు పంపిన మూడు బిల్లులతోపాటు పశ్చిమ బెంగాల్ పంపిన మరో మూడు బిల్లులను నిలిపేశారు. ఒడిశా, అస్సాం పంపిన ఒక్కో బిల్లును కూడా “విత్‌హెల్డ్”లో పెట్టారు. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండి రామ్‌నాథ్‌కోవింద్ హయాంలో గ్రీన్ సిగ్నల్ పొందిన బిల్లుల్లో ‘గుజరాత్ కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ బిల్లు-2015’ కూడా ఒకటి. ఈ బిల్లు ఏకంగా 16 ఏళ్లపాటు పచ్చజెండాకు నోచుకోలేదు. యూపీఏ పదేళ్లు అధికారంలో ఉన్నా దీనికి ఓకే చెప్పలేదు. పశ్చిమ బెంగాల్ పంపిన రెండు(జెసాప్ అండ్ కంపెనీ, డన్‌లప్ ఇండియా) బిల్లులకు రామ్‌నాథ్‌కోవింద్ సమ్మతించలేదు.
చట్టపరమైన అడ్డంకుల వల్ల వీటిని పక్కన పెట్టారు. ఈ బిల్లులను పశ్చిమ బెంగాల్ శాసన సభ ఏడేళ్ల కిందట పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-200 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును పాస్ చేసి ముందుగా గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపాలి. ఆ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు లేదా తన వద్ద పెండింగ్‌లో పెట్టొచ్చు లేదా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపొచ్చు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలతోపాటు తన విచక్షణాధికారంతో ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ తమిళనాడు గవర్నర్ పంపిన ‘ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల బిల్లు-2017’ని నిలిపేశారు.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చివరిసారిగా సంతకం చేసిన బిల్లుల్లో ‘క్రిమినల్ లా (మధ్యప్రదేశ్ అమెండ్‌మెంట్) బిల్లు-2019’ కూడా ఉంది. రామ్‌నాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీలక బిల్లుల్లో ‘ఉత్తరప్రదేశ్ మినిమం వేజెస్ (అమెండ్‌మెంట్) బిల్లు-2017’ ఉండటం గమనార్హం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్‌కి సంబంధించి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ పంపిన మూడు బిల్లుల పైనా రాష్ట్రపతి సంతకం చేశారు. ఐదేళ్లలో మొత్తం 29 దేశాల్లో పర్యటించారు. జమైకా దేశంలో పర్యటించిన తొలి భారత రాష్ట్రపతిగా పేరొందారు.