Site icon NTV Telugu

Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్

Ram Mohan Naidu

Ram Mohan Naidu

ఇండిగో ఎయిర్‌లైన్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మంచి ఫీక్ సమయం చూసుకుని దెబ్బకొట్టింది. సహజంగా డిసెంబర్‌లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎవరి మీద కోపం.. ప్రయాణికులపై చూపించినట్లైంది. అకస్మాత్తుగా వందలాది విమాన సర్వీసులను రద్దు చేసేసి ఏమి తెలియనట్లుగా సైలెంట్‌గా ఉంది. ‘ఎవరేమైపోతే నాకేంటి?’ అన్నట్లుగా ఇండిగో వ్యవహారించింది. ఓ వైపు బుకింగ్‌లు చేస్తూనే.. ఇంకోవైపు ప్రయాణికులను విమానాశ్రయాలకు రప్పించి చివరి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లు చావు కబురు చెప్పి విచిత్రంగా వ్యవహారించింది. పాపం.. ఇండిగో ఎత్తుగడ ఎరగని ప్రయాణికులు మాత్రం చేసేదేమీ లేక విమానాశ్రయాల్లోనే చలిలో బిక్కుబిక్కుమంటూ మూడు రోజుల కాలం వెళ్లదీశారు. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం.

ఇండిగో సృష్టించిన సంక్షోభంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సంక్షోభం సృష్టించిన ఇండిగోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేపటి నుంచి ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు.

నవంబర్ 1 నుంచి కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చినా.. మిగతా విమానయాన సంస్థలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని.. అలాంటిది ఇండిగోకే ఎందుకు ఎదురవుతాయని ప్రశ్నించారు. అంటే ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభం అని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడతాయని.. రేపటి నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండిగో అంతరాయాలను విచారించడానికి, తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి ఒక కమిటీ వేస్తామని వెల్లడించారు. అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం FDTL మార్గదర్శకాలు ప్రధాన కారణమని చెబుతున్నారని.. కానీ ఇతర విమానయాన సంస్థలు కూడా (నిబంధనలు) పాటిస్తున్నాయని.. వారికి ఎటువంటి సమస్య లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Exit mobile version