NTV Telugu Site icon

Rameshwaram Cafe blast: ఉగ్రవాదుల టార్గెట్ కేఫ్ కాదు.. ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు

Rameshwaramcafeblast

Rameshwaramcafeblast

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల తొలి టార్గెట్ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పేల్చడమేనని వెల్లడించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం రోజే బీజేపీ కార్యాలయాన్ని ఐఈడీతో పేల్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిపింది. అది విఫలం అవ్వడంతోనే రామేశ్వరం కేఫ్‌ పేలుడుకు ఫ్లాన్ చేసినట్లు వెల్లడించింది. బెంగళూరు ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో ఈ విషయాలను స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Air Force Helicopter: సాంకేతిక లోపంతో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చెన్నై సమీపంలో అత్యవసర ల్యాండింగ్

ఈ కేసులో నలుగురు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహా, మాజ్‌ మునీర్‌ అహ్మద్‌, ముజామ్మిల్‌ షరీఫ్‌లను నిందితులుగా చేర్చింది. వీరిలో షాజీబ్‌, తాహాలు ఐసిస్‌ రాడికల్స్‌ అని తెలిపింది. ఈ దాడుల కోసం డార్క్‌ వెబ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన భారత్‌, బంగ్లాదేశ్ గుర్తింపు కార్డులను ఉపయోగించినట్లు గుర్తించింది. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

2024, మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. మార్చి 3న ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ.. వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఏజెన్సీల సమన్వయంతో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించింది. ఇందుకోసం పలు సాంకేతిక, క్షేత్రస్థాయి పరిశోధనలు సైతం నిర్వహించింది. షాజీబ్ అనే నిందితుడు బాంబును అమర్చాడని విచారణలో తేలింది. రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన జరిగి 42 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో దాక్కున్న నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

ఇది కూడా చదవండి: Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం

తాహా మరియు షాజిబ్‌లకు క్రిప్టో కరెన్సీల ద్వారా హ్యాండ్లర్ నిధులు సమకూర్చారని పేర్కొంది. బెంగళూరులో వివిధ హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు నిందితులు ఈ నిధులను వినియోగించినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం రోజున బెంగళూరులోని మల్లేశ్వరంలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం దగ్గర విఫలమైన ఐఈడీ దాడి.. ఆ తర్వాత ఇద్దరు కీలక నిందితులు రామేశ్వరం కేఫ్‌ పేలుడుకు ప్లాన్‌ చేశారని ప్రకటన పేర్కొంది.

ఇది కూడా చదవండి: Indonesia: ఇండోనేషియాలో విమానం ప్రమాదం.. రన్‌వే నుంచి జారిపడ్డ ఫ్లైట్