NTV Telugu Site icon

Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..

Arun Yogiraj

Arun Yogiraj

Arun Yogiraj: అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిన శిల్పిగా అరుణ్ యోగిరాజ్ ఫేమస్ అయ్యారు. అమెరికా వర్జీనియాలో జరిగే మూడు రోజుల సదస్సు కోసం ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 01 వరకు 12వ AKKA వరల్డ్ కన్నడ కాన్ఫరెన్స్ (WKC 2024)కి యోగిరాజ్‌కి ఆహ్వానం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయనకు అమెరికా వీసా నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శిల్ప కళా రంగంలో యోగి రాజ్ చేసిన సేవలని గుర్తిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని పంపారు.

అమెరికా వెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వీసా నిరాకరించడంపై ఆయన భార్య మాట్లాడుతూ.. ఆయన చాలా సార్లు అమెరికా వెళ్లారు, ఎప్పుడూ అమెరికా వీసాను తిరస్కరించలేదు, ఇప్పుడు ఇలా చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అమెరికా పర్యటన ఏకైక ఉద్దేశ్యం కార్యక్రమానికి హాజరుకావడమే అని, ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత యోగిరాజ్ భారతదేశానికి తిరిగి రావాలని భావించారు. అయితే, తాము అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ వీసాను ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Read Also: CM Revanth Reddy : ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లో ఫోర్త్‌ సిటీని నిర్మించబోతున్నాం

రామ్ లల్లాను చెక్కిన శిల్పిగా పేరు..

ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహానికే ప్రాణప్రతిష్ట చేశారు. కార్పొరేట్ సెక్టార్‌లో కొంత కాలం పనిచేసిన ఆయన 2008లో శిల్పకళపై మక్కువతో ఈ కళను ఎంచుకున్నారు. రామ్ లల్లా విగ్రహంతో పాటు ఇండియా గేట్ సమీపంలోని 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కేదార్‌నాథ్‌లో 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని, మైసూరులో 21 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆయనే తయారు చేశారు.