Site icon NTV Telugu

Assam: కాంగ్రెస్ ఎంపీ రకీబుల్‌పై దుండగుల దాడి.. సిబ్బందికి గాయాలు

Assamcongrssmp

Assamcongrssmp

అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దుండగులు దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యక్రమానికి స్కూటర్‌పై వెళ్తుండగా ముసుగులు ధరించిన ఆగంతకులు బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది..ఎంపీని సురక్షితంగా తప్పించారు. అయితే ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నాగావ్ జిల్లాలో పార్టీ సమావేశానికి స్కూటర్‌పై వెళుతుండగా ఈ దాడి జరిగింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముసుగులు ధరించిన వ్యక్తులు ఎంపీ హుస్సేన్‌ను క్రికెట్ బ్యాట్‌తో కొట్టడం, అతన్ని వెంబడించడం, భద్రతా సిబ్బందిలో ఒకరి ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించడం కనిపించింది. ఈ ఘటనపై అస్సాం డీజీపీ హర్మీత్ సింగ్ స్పందించారు. ‘‘స్వల్ప గాయాలు తప్ప ఎవరికీ ఏం కాలేదు. ఈ సంఘటనపై ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు.” అని డీజీపీ అన్నారు. హుస్సేన్ పార్టీ సమావేశానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని నాగావ్ ఎస్పీ స్వపనీల్ దేకా తెలిపారు.

ఇది కూడా చదవండి: Hyderabad: అలర్ట్.. అంబర్‌పేట్‌లో నలుగురు విద్యార్థులు అదృశ్యం…

దాడి ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందిస్తూ.. ఎంపీ రకిబుల్‌కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారికపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రకీబుల్‌ అస్సాంలో దూబ్రీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రకీబుల్‌ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో 10 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. దాడికి గల కారణాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.

 

Exit mobile version