Site icon NTV Telugu

Sonia Gandhi: రాజీవ్‌ గాంధీ జీవితం దారుణంగా ముగిసింది.. తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారు

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ జీవితం దారుణంగా ముగిసిందని.. ఆయన పరిపాలించిన తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారని కాంగ్రెస్‌ అధినేత్రి, రాజీవ్‌గాంధీ సతీమణి సోనియా గాంధీ అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్బంగా వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించి ఢిల్లీలోని జవహర్ భవన్‌లో జరిగిన జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ హారయ్యారు. సోనియాతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

Read also: Alleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం.. ఉద్రిక్తత..

తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా తొందరగా అత్యంత కిరాతకంగా ముగిసిందని.. అయినప్పటికీ తాను పాలించిన కొద్ది కాలంలోనే ఎవ్వరికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు సాధించారని.. 25వ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ తెలిపారు. రాజీవ్‌కు దొరికిన కొద్దిపాటి సమయంలోనే దేశం కోసం.. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎంతో చేశారని జ్ఞాపకం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా పంచాయతీల్లోనూ, మున్సిపల్ కార్యవర్గాల్లోనూ మహిళలు సుమారు 15 లక్షల మంది ఉన్నారని … ఇదంతా ఆనాడు రాజీవ్ గాంధీ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పించడానికి చేసిన కృషి ఫలితమేనని సోనియా గుర్తు చేశారు. దాంతోపాటు ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించిన ఘనత కూడా రాజీవ్‌ గాంధీకే దక్కుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి సోనియా గాంధీ వివరిస్తూ మత సామరస్యాన్ని చెడగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నారని.. అటువంటి వారికి మరికొంత మంది మద్దతు తెలపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ మత, జాతి, భాష, సంస్కృతులను సున్నితమైన అంశాలుగా చెబుతూ వీటిని అందరం కలిసి పండగలా నిర్వహించుకుంటేనే జాతి ఐక్యత సాధ్యమని నమ్మేవారన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌ గాంధీ 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈ జాతీయ సద్భావనా అవార్డు 2021-22 సంవత్సరానికి గాను రాజస్థాన్ లోని గురుకుల పాఠశాల బానస్థలి విద్యాపీఠ్ మహిళల గురుకుల సంస్థకు అందజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డును గురుకుల పాఠశాల బావనస్థలి విదా్యపీట్‌ తరపున సిద్దార్ధ శాస్త్రి అవార్డును స్వీకరించారు.

Exit mobile version