Rajiv Gandhi Foundation took grants from China, Zakir Nair says amit shah:రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిఎఫ్)కు చైనా రాయబార కార్యాలయం, ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ నుంచి నిధులు పొందిందని.. అందుకే దాని రిజిస్ట్రేషన్ రద్దు చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎఫ్సీఆర్ఏ (విదేశీ కంట్రిబ్యూషన్ (నియంత్రణ) చట్టం) ఉల్లంఘించిందుకే ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై ప్రశ్నలను నిలువరించేందుకే కాంగ్రెస్ పార్లమెంట్ లో సరిహద్దు సమస్యలను లేవనెత్తిందని అన్నారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చైనా రాయబార కార్యాలయం నుంచి రూ. 1.35 కోట్ల నిధులను అందుకుందని అమిత్ షా ఆరోపించారు. 2005-07లో చైనీస్ ఎంబీసీ నుంచి రూ. 1.35 కోట్లను పొందిన రాజీవ్ ఫౌండేషన్ వాటిని ఏం చేసిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విధంగా 2011 జూలైలో అనుమతి లేకుండా రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలో జకీర్ నాయక్ సంస్థ నుంచి రూ.50 లక్షలు ఎందుకు తీసుకుందో దేశానికి చెప్పాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు.
Read Also: Asaduddin Owaisi: చైనా పేరు చెబితేనే ప్రధాని మోదీ భయపడుతున్నారు..
నెహ్రుకు చైనాపై ఉన్న ప్రేమ కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని కోల్పోయిందని అన్నారు. ఎంబసీల నుంచి వచ్చిన నిధులను భారత్-చైనా సంబంధాలపై పరిశోధనలు చేయడానికి ఉద్దేశించినట్లుగా కాంగ్రెస్ చెబుతుందని.. 1962లో జరిగిన యుద్ధంలో భారత్ కోల్పోయిన భూమికి సంబంధించిన అంశాన్ని ఈ పరిశోధనలో పొందుపరిచారా..? అని, 2009 అక్టోబర్ 13న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా ప్రశ్నలు లేవనెత్తిందని గుర్తుచేస్తూ, ఈ అంశంపై పార్టీ పరిశోధన చేసిందా అని అమిత్ షా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
గాల్వాన్ లో భారత సైనికులు చైనా సైన్యంతో పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు చైనా రాయబార కార్యాలయ అధికారికి విందు ఇస్తున్నారని.. చైనా నుంచి ఎదురైన బెదిరింపులతో 2012లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని అమిత్ షా ప్రశ్నించారు.