Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..

  • రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల తర్వాత రాజకీయ లెక్కలు ప్రారంభం..
  • మేయర్, చైర్మన్ పదవుల కోసం బీజేపీ, కాంగ్రెస్ పాలిటిక్స్..
  • చాలా ప్రాంతాల్లో ఇండిపెండెట్లు కీలకం..
  • మరోవైపు, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి..
Rajasthan

Rajasthan

Rajasthan:  ఏ రాష్ట్రమైనా కాంగ్రెస్ తీరు మారడం లేదు. గెలుపు దరిచేరినా, అంతర్గత కారణాలతో ఆ గెలుపును బీజేపీ పళ్లెంలో పెడుతోంది. తాజాగా రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, అధికార బీజేపీకి పోటీ ఇచ్చింది. రాజస్థాన్‌లో మొత్తం 309 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాల్లో 4179 వార్డులను గెలుచుకుని, 40.8 శాతం వాటాను సాధించింది బీజేపీ. కాంగ్రెస్ 3613 వార్డులను గెలుచుకుందిన 35.3 శాతం వాటాను దక్కించుకుంది. స్వతంత్రులు 2273 వార్డుల్లో గెలిచారు. చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇప్పటికే బీజేపీ ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అంతర్గత కల్లోలాలతో సతమతం అవుతోంది.

జోధ్‌పూర్ బీజేపీ పైచేయి..

జోధ్‌పూర్ నగరంలో ముందుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 44 సీట్లను దక్కించుకున్నాయి. అయితే 50వ వార్డులో రీకౌంటింగ్‌తో బీజేపీ అభ్యర్థి 83 ఓట్లతో గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బీజేపీలో చేరారు. పోలీసులే బలవంతంగా అతడిని బీజేపీలో చేరేలా చేశారని కాంగ్రెస్ నిరసనకు దిగింది. జోధ్‌పూర్‌లో 11 మంది ఇండిపెండెంట్లు గెలిచారు.

పాలి, బికనీర్‌లో వర్గపోరు..

పాలి మున్సిపల్ కార్పొరేషన్‌లో 65 స్థానాలకు గానూ బీజేపీ 21, కాంగ్రెస్ 29, ఇండిపెండెంట్లు 11 మంది గెలిచారు. నిజానికి కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ అధికారిక మేయర్ అభ్యర్థికి వ్యతిరేకంగా, రాబబాల హింగాడ్ స్వతంత్ర్యంగా మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.

ఇక బికనీర్‌లో కూడా ఇదే సమస్య కనిపిస్తోంది. బికనీర్‌లో మొత్తం 80 స్థానాలకు బీజేపీ 27, కాంగ్రెస్ 42, ఇండిపెండెంట్లు 11 మంది గెలిచారు. బికనీర్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నేత బి.డి. కల్లా మేనల్లుడు అనిల్ కల్లాను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించిన తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్ నవరతన్ దాగా కూడా మేయర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. బికనీర్‌ కాంగ్రెస్ ఒకే కుటుంబ ఆధిపత్యం కుదరదని విమర్శించారు.

అజ్మీర్‌లో క్యాంప్ రాజకీయాలు..

అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 80 వార్డులకు గానూ బీజేపీ 32, కాంగ్రెస్ 37, ఇతరులు 11 గెలిచారు. అయితే, కాంగ్రెస్ కార్పొరేటర్లు జంప్ అయ్యే అవకాశం ఉందని, గెలిచిన కార్పొరేటర్లను బెంగళూర్ క్యాంప్‌కు తరలించారు. కాంగ్రెస్ శిబిరంలో మేయర్ అభ్యర్థిత్వంపై విభేదాలు బయటపడ్డాయి. కిరన్ గర్హ్వాల్ టికెట్ ఇవ్వడంపై రష్మీ శర్మ తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది.

చాలా చోట్ల ఇండిపెండెంట్ల హవా..

రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. అజ్మీర్, అల్వార్, జోధ్‌పూర్, పాలి, భరత్‌పూర్ వంటి నగరాల్లో ఇండిపెండెట్లు లేకుండా ఏ పార్టీ కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. భరత్‌పూర్‌లో మొత్తం 65 సీట్లకు గానూ బీజేపీ 20, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్లు 38 స్థానాల్లో గెలిచారు. ఇప్పటికే 9 మంది స్వతంత్రులు బీజేపీకి మద్దతు తెలియజేశారు.

సెప్టెంబర్ 21న ఓటింగ్..

మేయర్, చైర్మన్, అధ్యక్ష పదవుల కోసం సెప్టెంబర్ 21న ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ లెక్కలు మొదలుపెట్టాయి. పార్టీల మధ్య లాబీయింగ్, క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. స్వతంత్రుల్ని తమ వైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు చర్చిస్తున్నాయి.