Himachal Pradesh: సుందరమైన హిమాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో బీతావహంగా మారిపోతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వేల కోట్ల నష్టపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నెల 29 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. 729 రహదారులను మూసివేశారు. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తూ శుక్రవారం యల్లో అలర్ట్ జారీ చేసింది. కుండపోతతో హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం కొండచరియలు విరిగిపడటంతో పాటు అనేక చోట్ల భవనాలు కుప్పకూలాయి. ఆగస్ట్ 29 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొనడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల నేపధ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని పాఠశాలలు, విద్యాసంస్ధలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Read Also: Viral Video : ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి.. కూతురంటే ఎంత ప్రేమో
భారీ వర్షాలకు విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో కులు-మండి హైవేపై వందలాది మంది నిలిచిపోయారు. హైవేపై వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కులు-మండి హైవేపై చిక్కుకున్న వారిని హోటళ్లు, రెస్టారెంట్లు, నివాస సముదాయాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు రెస్క్యూ సిబ్బంది తరలిస్తున్నారు. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా, శుక్రవారం సిమ్లాలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో 729 రోడ్లు మూసివేశామని, 2,897 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేదని ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. మండికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రాష్ట్రంలో ఈ నెలలో 120 మంది కొండచరియలు విరిగిపడటం మరియు ఇతర వర్షాలకు సంబంధించిన సంఘటనలలో మరణించారు, వారిలో సుమారు 80 మంది ఆగస్టు 14 నుండి మరణించారు. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి మొత్తంగా, రాష్ట్రంలో 242 మంది మరణించారు. రాష్ట్రానికి ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి సుక్కు ప్రకటించారు.