NTV Telugu Site icon

Supreme Court On Rahul Gandhi: రాహుల్‌ పిటిషన్‌ విచారణ.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Rahul Gandhi

Rahul Gandhi

Supreme Court On Rahul Gandhi: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో పాటు.. గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్ట్ 4వ తేదీకి వాయిదా వేసింది.

Read also: Heavy Rains: కామారెడ్డిలో భారీ వర్షాలు..బయటకు రావొద్దంటు దండోరా..

రాహుల్‌ తరఫున సీనియన్‌ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సెషన్‌ కోర్టు తీర్పు శిక్ష కారణంగా రాహుల్‌ గాంధీ 111 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే ఒక పార్లమెంట్‌ సెషన్‌కు దూరమయ్యారని సింఘ్వీ వాదించారు. ఇపుడు ప్రారంభమైన వర్షాకాల సెషన్‌కు కూడా ఆయన దూరం కావాల్సి వచ్చిందని.. అందువల్ల త్వరితగతిన దీనిపై విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. సెషన్స్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో రాహుల్‌ గాంధీకి కిందికోర్టు శిక్ష విధించడం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ రాహుల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.