NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యంపై నీలినీడలు.. ఇండియా కూటమిలో మమతకు మద్దతు…

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీ అధికారంలోకి రాకుండా, ప్రధాని మోడీని గద్దె నుంచి దించాలని ప్రతిపక్షాలన్నీ కలిసి ‘‘ఇండియా కూటమి’’ని ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మెజారిటీ పార్టీలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి(టీఎంసీ), బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి క్రమంగా మద్దతు పెరుగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఆప్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఆమెకు మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని కోరుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆమెకు మద్దతు పలికారు.

దీంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రమంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్నప్పటికీ, ఆ తర్వాత నెలల వ్యవధిలో జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్, దానికి తగ్గట్లుగా విజయం సాధించలేకపోయింది. ఫలితంగా కూటమిలోని ఇతర పార్టీలపై కూడా కాంగ్రెస్ ప్రభావం పడిందని మిత్రపక్షాలు చెప్పకనే చెబుతున్నాయి.

Read Also: Moto g35 5G: 10 వేల కంటే తక్కువ ధరలో చౌకైన ఫోన్ ను తీసుకొచ్చేస్తున్న మోటోరోలా

ఈ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ మేము మమతా బెనర్జీకి మద్దతు ఇస్తాము. ఆమె ఇండియా కూటమికి సారథ్యం వహించడానికి అనుమతించాలి’’ అని అన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ కూడా మమతా బెనర్జీకి మద్దతు ఇచ్చింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన ఈగోని పక్కన పెట్టి, మమతా బెనర్జీని ఇండియా కూటమికి చీఫ్‌గా చేయాలని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఈ ప్రతిపాదనల్ని కొట్టిపారేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. జోక్‌గా కొట్టిపారేశారు. బెంగాల్ బయటక టీఎంసీ ఉనికి లేని చెప్పారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ భవిష్యత్ ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పరిణామం విషమ పరీక్షలా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన కాంగ్రెస్, బీజేపీని సొంత బలం రాకుండా, మిత్ర పక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చేలా చేసింది. ఇది ఎంతోకొంత రాహుల్ గాంధీ మైలేజ్‌ని పెంచింది. ఇదే ఊపుతో హర్యానా, మహారాష్ట్రలో గెలుస్తామని భావించినప్పటికీ, కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది. ఇక జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ, ఈ గెలుపు క్రెడిట్ మొత్తం జేఎంఎం, హేమంత్ సొరెన్‌కి దక్కింది. ఈ ఓటముల కారణంగా మిత్రపక్షాలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ తీరును ప్రశ్నిస్తున్నాయి.