Site icon NTV Telugu

Rahul Gandhi: రాయ్‌బరేలీ “కర్మభూమి”.. నా తల్లి బాధ్యతల్ని అప్పగించింది..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని పర్యాయాలుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. నామినేషన్ తర్వాత ఆయన భావోద్వేగంతో ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి 20 ఏళ్లుగా కొనసాగిన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌‌బరేలీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడం తనకు ఉద్వేగభరితమైందని ఆయన శుక్రవారం అన్నారు. తన కుటుంబానికి ‘కర్మభూమి’గా రాయ్‌బరేలీని అభివర్ణించారు. తన తల్లి ఈ బాధ్యతల్ని అప్పగించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు.

Read Also: Pawan Kalyan: కూటమి అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో ఇప్పటికే కేరళ వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్, రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్‌బరేలీ రెండూ నాకు వేర్వేదు కాదని, ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజలు తన కటుంబమే అని, 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్న కిషోరి లాల్ జీ అయేథీ నుంచి పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహించడం పట్ల రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు.

‘‘ అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో, నేను నా ప్రియమైన వారి ప్రేమ, ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఈ పోరాటంలో మీరందరూ నాకు అండగా ఉంటారనే నమ్మకం ఉంది. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఆయన నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, తల్లి సోనియా గాంధీ, రాబర్ట్ వాడ్రా హాజరయ్యారు. రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీ ఎన్నికయ్యారు. మరోవైపు రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.

Exit mobile version