Anurag Thakur: దేశానికి వ్యతిరేకంగా పనిచేసే భారత వ్యతిరేక శక్తులే విదేశాల్లో రాహుల్ గాంధీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. అలాంటి వారిలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కు ఏం సంబంధాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిదేళ్లను పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన ‘సంపర్క్ సే సమర్థన్’ ప్రచారం సందర్భంగా ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరి మద్దతుతో ఆయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయో తెలిస్తే కాంగ్రెస్ ఆలోచన స్పష్టంగా కనిపిస్తుందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. భారతదేశానికి వ్యతిరేఖ ఎజెండాను నడుపుతున్న సంస్థలకు ఇండియాను విడగొడతాం అని మాట్లాడే వ్యక్తులు, ఇలాంటి దేశవ్యతిరేక కార్యక్రమాలకు ఫండ్స్ ఇచ్చే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. షాహీన్ బాగ్ విషయంలో నిధులు అందించాయని, భారత్ పై విషం చిమ్మే వారికి ఆ సంస్థలు నిధులు అందించాయని ఆయన ఆరోపించారు.
పాకిస్తాన్ ను పొగిడే వారు, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారు రాహుల్ గాంధీకి మద్దతు పలుకుతారని ఆయన ఆరోపించారు. భారత వ్యతిరేక శక్తుల నుంచి మద్దతు, సహాయం పొందాల్సిన నిస్సహయాత ఎందుకు..? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అలాంటి సంస్థల నుంచి వచ్చే ఆహ్వానాలతో రాహుల్ గాంధీ హాజరై దేశానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారంటూ ఆరోపించారు. అధికారంలోకి రావడానికి భారతదేశ విచ్ఛినం గురించి మాట్లాడే వారితో రాహుల్ గాంధీ ఉంటున్నారని దుయ్యబట్టారు. ఇటీవల భారత్ వ్యతిరేకతను ప్రదర్శించే జార్జ్ సోరోస్ సంస్థకు సంబంధించిన వ్యక్తితో రాహుల్ గాంధీ వేదిక పంచుకోవడాన్ని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
