NTV Telugu Site icon

Kerala: వయనాడ్ లో రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి

Rahul Gandhi

Rahul Gandhi

కేరళలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం అల్లర్లకు కారణం అయ్యారు. ఏకంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయాన్ని శుక్రవారం ధ్వసం చేశారు. కేరళలోని కొండ ప్రాంతాల్లోని అడవుల చుట్టూ బఫర్ జోన్ల వల్ల కలిగే ఇబ్బందులపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ తీవ్ర ఆందోళనలకు తెరతీసింది వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ.

ఆందోళనల్లో భాగంగా వయనాడ్ లోని రాహుల్ గాంధీ ఆఫీస్ పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన విజువల్స్ కేరళలోని అన్ని ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. దాదాపుగా 100 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాహుల్ గాంధీ కార్యాలయంలోకి ప్రవేశించారు. కార్యాలయంలోని ఫర్నీచర్ తో పాటు అక్కడ ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 8 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడిపై కేరళ కాంగ్రెస్ నాయకులతో పాటు జాతీయ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సతీషన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఎస్ఎఫ్ఐ గుండాలు చేసిన దాడి ఘోరమని.. సీపీఎం వ్యవస్థీకృత మాఫియాగా మారిందని ఆయన ట్విట్టర్ లో ఆరోపించారు.

పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని.. ఇది సీపీఏం నాయకత్వం చేస్తున్న స్పష్టమైన కుట్రగా విమర్శించారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. కేరళ సీపీఎం కూడా నరేంద్రమోదీ దారిలో వెళ్తుందని అన్నారు. ఈ ఘటనపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు కేసీ వేణుగోపాలు వ్యాఖ్యానించారు.