Rahul Gandhi: ఎలాన్‌ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!

  • ఎలాన్ మస్క్‌కు రాహుల్ గాంధీ మద్దతు..
  • ‘‘స్టార్‌లింక్’’ వ్యవహారంలో అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..
  • కాంగ్రెస్‌‌ను ఇరుకునపెట్టేందుకు బీజేపీకి అందివచ్చిన అవకాశం..
Rahul Gandhi (1)

Rahul Gandhi (1)

Rahul Gandhi: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘‘స్టార్‌లింక్’’ భారత్‌లో రాజకీయ దుమారానికి కారణమైంది. భారతదేశంలో కొందరు వ్యాపారవేత్తలు తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలైన ‘‘స్టార్‌లింక్’’ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ తర్వాత, ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా భారత్ తమకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఇదే కాకుండా ‘‘భారతదేశానికి నిజమైన బాస్ అంబానీనా?’’ అని ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఆయన ముఖేష్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే, ఎలాన్ మస్క్‌కు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మద్దతు తెలుపుతూ ఎక్స్‌లో కామెంట్స్ పెట్టారు. ‘‘భారత్‌కు స్వాగతం, ఎలాన్. ఇక్కడ మరో వ్యక్తి ఎవరో తెలుసుకునే వరకు ఆగండి’’ అని ట్వీట్ చేశారు. ఆ మరో వ్యక్తి గౌతమ్ అదానీ అని చాలా మంది భావిస్తున్నారు. పలు సందర్భాల్లో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ గుప్పిట్లో ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

మస్క్ ట్రాప్‌లో రాహుల్.. బీజేపీకి కొత్త ఆయుధాలు..

అయితే, మస్క్ ఆరోపణలను కేంద్రం ఖండించింది. స్టార్‌లింక్‌తో సహా మూడు శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకు భద్రతాపరమైన పరిశీలనలో ఉన్నాయని చెప్పింది. ఈ వ్యవహారంలో భారత జాతీయ భద్రతా అంశాన్ని బీజేపీ ప్రస్తావిస్తోంది. గతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో, మణిపూర్‌లోని తిరుగుబాటుదారుల వద్ద స్టార్‌లింక్ పరికరాలు దొరికినట్లుగా పలు నివేదికలు వచ్చాయి.

ఈ అంశాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. జాతీయ ప్రయోజనాల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి ప్రశ్నార్థకంగా ఉందని విమర్శించింది. ఇదే సమయంలో రాహుల్, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్‌పై ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. స్టార్ లింక్ అంశం దీనిని పక్కదారి పట్టించేలా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో 2025లో స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశించే అవకాశంపై కాంగ్రెస్ పార్టీనే జాతీయ భద్రతా ఆందోళనల్ని ప్రస్తావించిన విషయాన్ని బీజేపీ ఎత్తిచూపుతోంది. ఎయిర్‌టెల్, జియో సంస్థలు స్టార్‌లింక్‌తో భాగస్వామ్యాలు కుదుర్చుకున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో స్నేహం కారణంగా ప్రధాని మోడీ ఈ ఒప్పందానికి సహకరించారని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసింది.

ఇప్పుడు ఇదే స్టార్‌లింక్‌కు మోడీ ప్రభుత్వం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించడాన్ని హైలెట్ చేస్తోంది. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ఒకప్పుడు స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోందని విమర్శించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్ వైఖరిలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ విదేశీ వ్యాపారవేత్తలకు మద్దతుగా నిలిచి, సొంతదేశ వ్యాపారవేత్తలపై ఆరోపణలు చేస్తోందని బీజేపీ మండిపడుతోంది.

రాహుల్‌ గాంధీని సమర్థిస్తున్న కాంగ్రెస్..

రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ సమర్థిస్తోంది. మస్క్‌కు కానీ, కేంద్ర ప్రభుత్వ విధానానికి కానీ రాహుల్ మద్దతు ప్రకటించలేదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. భారత్ మార్కెట్ ఒకే సంస్థ ఆధిపత్యంలో లేదా రెండు సంస్థల గుప్పిట్లో ఉందనే అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారని అన్నారు.