Site icon NTV Telugu

Bharat Jodo Yatra: కర్ణాటకలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Jodo Yatra: కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ కర్ణాటకలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలో అడుగుపెట్టిన రాహుల్‌గాంధీకి రాష్ట్ర సరిహద్దులోని గుండ్లుపేట్‌ దగ్గర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కర్ణాటకలో 17రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాహుల్ గాంధీకి భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ కదం తొక్కుతూ పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. కేరళలోని కన్యాకుమారిలో ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. తమిళనాడు, కేరళలో 457 కిలోమీటర్ల మేర 22 రోజుల పాటు సాగింది భారత్ జోడో యాత్ర.

Congress Presidential Election: దిగ్విజయ్ ఔట్.. క్రీజులో ఆ ఇద్దరు..

నేడు, రేపు రెండు రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. అక్టోబర్2 న గాంధీ జయంతి సంధర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌కు ఆహ్వానం పలుకుతూ కాంగ్రెస్ నేతలు దారిపొడవునా ఏర్పాటు చేసిన రాహుల్ పోస్టర్లను నిన్న గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. చామరాజనగర్ జిల్లాలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లను చింపివేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇది అధికార బీజేపీ పనేనని ఆరోపించింది. ఇది ముమ్మాటికి ‘భారత్ టోడో’ పనేనని బీజేపీని ఉద్దేశించి కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును ఎవరూ ఆపలేరని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version