Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు ఎల్లప్పుడూ మతతత్వ శక్తులను రక్షించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరేసిన సంఘటనల్లో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు.
ఈ నెల ప్రారంభంలో ఇలాంటి సంఘటనలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనలు, ఘర్షణలు బీజేపీ ప్రభుత్వ నిఘా వైఫల్యాలను బయటపెట్టాయని పేర్కొన్నారు. ఆయన చేసిన విమర్శలపై సీఎం మాట్లాడుతూ.. మాంసాన్ని ఆలయాల్లో ఉంచవచ్చని చెప్పడానికి ప్రయత్నించే వారిపై స్పందించడానికి కూడా అర్హులు కాదని అన్నారు. అలాంటి వ్యక్తులు భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని విలేకరుల సమావేశంలో శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sonyliv : జూలై4 నుంచి ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ స్ట్రీమింగ్
ఒక హిందూ వ్యక్తి ఆవును వధించి , దానిలో కొంత భాగాన్ని ఆలయంలో పెడతారా..? మిగిలిన భాగాల సంగతేంటి..? అవి ఎక్కడికి పోయాయి..? అని సీఎం హిమంత ప్రశ్నించారు. ఈ సంఘటనలో కొందరు తప్పుడు వ్యక్తులు పాల్గొన్నారని స్థానికులు అంగీకరించారని, అలాంటి వారిని కాపాడేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. ఇది రాహుల్ గాంధీ విలక్షణం అని, వారు ఎల్లప్పుడు మతపరమైన శక్తులను రక్షించాలని కోరకుంటున్నారని, ప్రజల సామరస్యాన్ని కాదని ఆరోపించారు.
జూన్ 8న ఈద్ సందర్భంగా అనేక చోట్ల పశువులను చట్టవిరుద్ధంగా వధించారని, మాంసం భాగాలను ఆలయ ప్రదేశాల్లో పడేశారని సీఎం అన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ధుబ్రిలో 50 మందిని మరియు గోల్పారాలో ఐదుగురిని అరెస్టు చేశారు.
