NTV Telugu Site icon

Rahul Gandhi: కార్పెంటర్‌గా మారిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్పెంటర్ అవతారం ఎత్తారు. ఇటీవల పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ సామాన్య ప్రజానీకంతో మమేకం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూలీగా మారి సూట్‌కేస్ నెత్తిన పెట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా గురువారం రోజు ఆసియాలో అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్ అయిన ఢిల్లీలోని కీర్తీనగర్ మార్కెట్ లో కార్మికులు, కార్పెంటర్లతో ముచ్చటించారు. మార్కెట్ సందర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

Read Also: Ujjain Case: ఉజ్జయిని మైనర్ రేప్ కేసు.. తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..

రాహుల్ గాంధీ కార్పెంటర్ గా మారి వారితో కలిసి పనిచేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ‘‘నేను ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్‌కి వెళ్లి ఈరోజు కార్పెంటర్ సోదరులను కలిశాను. వారు కష్టపడి పనిచేసేవారు, అద్భుతమైన కళాకారులు,అందాన్ని రూపొందించడంలో ప్రవీణులు’’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వారి నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించానని అన్నారు.

దీనికి ముందు సెప్టెంబర్ 21న ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో రాహుల్ గాంధీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోర్టర్ అవతారమెత్తి వారిలాగే ఎర్రచొక్కాను ధరించి సామాను ఎత్తుకున్నారు. భారత్ జోడో యాత్ర నుంచి రాహుల్ గాంధీ ఇలా ప్రజలతో మమేకం అవుతున్నారు. మెకానిక్‌లు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారితో సంభాషిస్తున్నారు.