Site icon NTV Telugu

Rahul Gandhi: అధ్యక్ష ఎన్నిక వద్దు.. జోడో యాత్రే ముద్దు..!

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికంగా మారాయి.. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ కానుండగా.. 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.. ఇక, అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని.. ఆయన పోటీ చేయాల్సిందేనంటూ పలు రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేస్తున్నాయి… కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ 23.. అయితే, ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. భారత్​ జోడో యాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన.. పాదయాత్రను మధ్యలో విడిచి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నమాట..

Read Also: KTR: కజకిస్తాన్‌ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం

ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్​ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ సెప్టంబర్​ 30 కాగా.. అప్పటికి రాహుల్​ గాంధీ యాత్ర కేరళలో ముగిసి కర్ణాటకకు చేరుకోనుంది… కానీ, ఆయన మాత్రం మధ్యలో యాత్రను ఆపేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.. మరోవైపు, అధ్యక్ష పదవి కోసం పార్టీలోని అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశి థరూర్​ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీతో శశిథరూర్‌ సమావేశం కావడం కూడా చర్చగా మారింది. అంతే కాదు, ఈ జాబితాలోకి మరొకరు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక, రాష్ట్రాల నుంచి డిమాండ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో.. అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు రాహుల్‌ గాంధీని విజ్ఞప్తి చేస్తున్నారు..

ఇక, 1998 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ కాలం సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వచ్చారు.. మధ్యలో అంటే.. 2017లో రాహుల్‌ గాంధీకి బాధ్యతలు అప్పగించినా.. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నారు రాహుల్.. దీంతో.. మళ్లీ సోనియానే పగ్గాలు తీసుకున్నారు.. సుదీర్ఘ కసరత్తుల తర్వాత అధ్యక్ష ఎన్నికలకు సిద్ధం అవుతోంది పార్టీ.. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు.. దీంతో, బరిలోకి దిగేది ఎవరు? ఆ అవకాశం ఉందా? వరుసగా కొన్ని రాష్ట్రాల పీసీసీలు.. రాహుల్‌నే పార్టీ చీఫ్‌ను చేయాలంటూ తీర్మానాలు చేస్తున్న తరుణంలో.. ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠ నెలకొంది..

Exit mobile version