Rahul Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మే 13న ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. దీంతో రానున్న నెల రోజులు కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ కీలక నేత, ఇటీవల అనర్హతను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ సిద్ధం అవుతున్నారు. తాను ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పరువునష్టం కేసులో శిక్ష పడి, పార్లమెంట్ సభ్యుడిగా అనర్హతకు గురయ్యాడో అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు.
Read Also: Google: గూగుల్‌కు షాక్.. రూ. 1,337 కోట్ల ఫైన్ కట్టాల్సిందే
ఏప్రిల్ నుంచి కర్ణాటకలో రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 2019లో లోక్ సభ ఎన్నికలకు ముందు కోలార్ లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ నుంచే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆ సమయంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీలను ఉద్దేశిస్తూ.. ‘‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువునష్టం కేసును వేశారు. దీనిపై ఇటీవల సూరత్ కోర్టు తీర్పు ఇస్తూ.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఎంపీగా డిస్ క్వాలిఫై చేసింది.
తాజాగా కోలార్ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ ‘సత్యమేవ జయతే’ ర్యాలీని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. రాహుల్ అనర్హతపై కాంగ్రెస్ కు మద్దతుగా 18 ప్రతిపక్ష పార్టీలు అండగా నిలిచాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యతకు దారి తీస్తోంది.