Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..

  • BRICS డిన్నర్ వెజిటేరియన్ మెనూపై రాహుల్ గాంధీ విమర్శలు
  • 80 శాతం మంది భారతీయులు నాన్-వెజిటేరియన్లు అంటూ రాహుల్ వ్యాఖ్య
  • ఆహార మెనూపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్న కిరణ్ రిజిజు
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi:  న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలు ముగిశాయి. ఇప్పుడు ఇక రాజకీయమే మిగిలింది. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ వేడి పుట్టించింది. బ్రిక్స్ సదస్సులో విదేశీ నేతలకు వడ్డించిన శాఖాహార విందు మెనూపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో 80 శాతం మంది భారతీయులు నాన్-వెజ్ ఆహారం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ డిన్నర్ మెనూపై రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది.

“రికార్డు కోసం చెబుతున్నాను.. 80 శాతం మంది భారతీయులు నాన్-వెజిటేరియన్లు. భారతీయ నాన్-వెజిటేరియన్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాగే నా సోదరి చేసే చోలే భటూరే కూడా” అంటూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనితో పాటు చోటే భటూరే ఫోటోను కూడా షేర్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలకు మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మద్దతు తెలిపారు. భారతదేశంలోని వంటకాల వైవిధ్యంలో ప్రపంచ స్థాయి మాంసాహార వంటకాలు కూడా ఉన్నాయని అన్నారు. అలాంటి వంటకాలను విదేశీ నేతలకు ఎందుకు పరిచయం చేయలేదు అని ప్రశ్నించారు. భారతీయులపై బీజేపీ తన ఆహారపు అభిరుచుల్ని రుద్దుతోందని, ఇప్పుడు విదేశీ నేతలు, అతిథులపై కూడా ఇదే జరుగుతోందని విమర్శించారు.

అయితే, ఈ కామెంట్లకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. బ్రిక్స్ దేశాధినేతలు భారతీయ శాఖాహార వంటకాలను ఆస్వాదించారని అన్నారు. బ్రిక్స్ దేశాల నేతలకు వడ్డించిన ఆహార మెనూపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశంలో వివిధ ప్రాంతాలను ప్రతిబింబించేలా ఈ శాఖాహార మెనూను రూపొందించినట్లు ఆయన చెప్పారు. రుచితో పాటు పోషక విలువలకు కూడా ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు.

విందు మెనూలో ఏమున్నాయి..?

బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను వడ్డించారు. మెనూలో ఖాండ్వీ, పనీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, మిల్లెట్ పులావ్, మష్రూమ్ గలౌటీ, జిలేబీ వంటి వంటకాలు ఉన్నాయి. మిల్లెట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భారత్ ప్రోత్సహిస్తున్న ‘‘శ్రీ అన్న’’ పాటు సుస్థిర ఆహార విధానాన్ని కూడా ఈ మెనూలో ప్రతిబింబించేలా రూపొందించారు.