Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?

  • హస్తినకు చేరిన కర్ణాటక పంచాయితీ
  • సిద్ధరామయ్య-డీకే.శివకుమార్‌తో వరుస చర్చలు
  • 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు
Congressdelhi

Congressdelhi

కర్ణాటక పంచాయితీ మరోసారి హస్తినకు చేరింది. గత కొంత కాలంగా స్తబ్దతగా ఉన్న కుర్చీ పంచాయితీ.. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తట్టిలేపినట్లైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రిని ఎంపిక చేశారు. ఎలాంటి రచ్చ లేకుండా సానుకూలంగా హైకమాండ్ చక్కబరించింది. ఇప్పుడు కర్ణాటక వంతు వచ్చింది. ఈసారి డీకే.శివకుమార్ తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ ఢిల్లీలో మకాం వేశారు. ఇక మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌తో కేసీ వేణుగోపాల్ వరుస సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ మొదలుకొని కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా వరకు అందరూ నిరంతరం రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ 35 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు. డీకే.శివకుమార్ మరొక గదిలో నిరీక్షిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతకముందు మల్లిఖార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాతో దాదాపు 2 గంటల పాటు రాహుల్ గాంధీ మేథోమధనం చేసినట్లుగా సమాచారం. ఈ సమయంలో రణదీప్ సుర్జేవాలా ప్రభుత్వ పనితీరుపై ఒక నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అనంతరం సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్యంగా సమావేశమై 35 నిమిషాలు చర్చించారు. అయితే ఏం చర్చించారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.