Site icon NTV Telugu

Rahul Gandhi: అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు, అందుకే తప్పుడు భాష వాడారు..

Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ప్రక్రియపై బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మధ్య తీవ్ర వాడీవేడి చర్చ జరిగింది. అయితే, దీనిపై గురువారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అమిత్ షాను ఉద్దేశిస్తూ, బీజేపీ నాయకుడు ‘‘ఒత్తిడి’’లో ఉన్నట్లు కనిపించారని అన్నారు. ‘‘నిన్న పార్లమెంట్‌లో అమిత్ షా జీ చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన చేతులు వణుకుతున్నాయి, ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. అమిత్ షా జీ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు, ఇది నిన్న దేశమంతా చూసింది’’ అని అన్నారు. ‘‘ఓట్ చోరీ’’ గురించి తాను చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని అమిత్ షాకు తాను నేరుగా సవాల్ విసిరానని, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు.

Read Also: RSS: తమిళ హిందువులు చాలు.. “సుబ్రమణ్య స్వామి ఆలయ” వివాదంపై మోహన్ భగవత్..

‘‘నేను చెప్పిన విషయాలను ఆయన ప్రస్తావించలేదు, ఎటువంటి రుజువు ఇవ్వలేదు. నా పత్రికా సమావేశంపై నాతో చర్చకు రావాలని నేను అమిత్ షా జీకి నేరుగా సవాలు విసిరాను — దానికి కూడా ఎటువంటి స్పందన రాలేదు, నిజం ఏమిటో మీ అందరికి తెలుసు’’ అని తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో అమిత్ షా భయాందోళనకు గురయ్యారని, పూర్తిగా రక్షణాత్మకంగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.

బుధవారం పార్లమెంట్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఇది అవసరమని పేర్కొంటూ, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను షా సమర్థించారు. మరోవైపు, బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్ల మోసానికి పాల్పడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటు దొంగ తనం నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ హయాంలో జరిగిందని అమిత్ షా రాహుల్‌గాంధీకి కౌంటర్ ఇచ్చారు.

Exit mobile version