Site icon NTV Telugu

Rahul Gandhi: పెట్రో ధరలపై రాహుల్‌ సెటైర్లు.. పెంపు ప్రధాని దినచర్యలో భాగమైంది..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజువారి పెట్రోల్‌ ధరల పెరుగుదలకు బ్రేక్‌ పడింది.. అయితే, ఎన్నికలు ముగియడం.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. మళ్లీ క్రమంగా పైకి కదులుతూ సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయి పెట్రో ధరలు.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. పెట్రో ధ‌ర‌ల పెంపుపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. పెట్రో ధరల పెంపు అనేది ప్రధాని న‌రేంద్ర మోడీ దిన‌చ‌ర్యలో భాగ‌మైపోయింద‌ని ఎద్దేవా చేశారు. ఇక, గ్యాస్ ధ‌ర పెంపు, డీజిల్ ధ‌ర పెంపుతో పాటు రైతుల‌ను నిస్సహాయులుగా చేయ‌డం కూడా ప్రధాని మోడీ దిన‌చ‌ర్యలో భాగం చేసుకున్నార‌ని విమర్శలు గుప్పించిన రాహుల్.. #RozSubahKiBaat అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.

Read Also: AP: పవన్‌ కల్యాణ్‌కు ఓపెన్‌ ఛాలెంజ్.. దమ్ముంటే ఆ పని చేయి..

ప్రధానమంత్రి మోడీ రోజువారీ పనుల జాబితా అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చిన రాహుల్ గాంధీ.. 1. నేను పెట్రోల్-డీజిల్-గ్యాస్ రేటును ఎంత పెంచాలి?.. 2. ప్రజల ఖర్చులపై వస్తున్న చర్చను ఎలా ఆపాలి?.. 3. యువత ఉపాధికి సంబంధించిన కలలను ఎలా మభ్యపెట్టాలి?.. 4. ఈరోజు ఏ ప్రభుత్వ కంపెనీని విక్రయించాలి?.. 5. రైతులను మరింత నిస్సహాయులుగా చేయడం ఎలా..? అంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ఆలోచిస్తారంటూ.. ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు రాహుల్‌ గాంధీ.

Exit mobile version