Rahul Gandhi: హర్యానా ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల మొదటివారంలో ఈ రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, వరసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు కూడా తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో సొంతగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇది తమకి మైనస్‌గా మారి, బీజేపీకి ప్లస్ అవుతుందేమో అని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అనుకుంటోంది.
అయితే, రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు పెట్టుకునేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఆప్‌తో పొత్తుకు అవకాశంపై హర్యానా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా, గుజరాత్, గోవా, ఢిల్లీ, చండీగఢ్‌లలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేశాయి.
గత నెలలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కుమారి సెల్జా మాట్లాడుతూ.. హర్యానా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తుపెట్టుకునే అవకాశాన్ని తోసిపుచ్చారు. తాము రాష్ట్రంలో బలంగా ఉన్నామని, ఒంటరిగా పోటీ చేస్తామని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తమ పార్టీ హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు సొంతగా పోటీ చేస్తామని చెప్పారు. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడికానున్నాయి.