Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi New Team: కాంగ్రెస్‌ అంటేనే సీనియర్‌ నాయకులు, పాత ముఖాలు.. ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలో ఎన్నో రకాల పదవులు అనుభవించినవారు ఎంతో మంది.. అంతే కాదు.. వివాదాల్లో ఉన్నవారు కూడా లేకపోలేదు.. అయితే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొత్త టీమ్‌ను దింపే ప్రయత్నాల్లో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీలో కొత్త, దూకుడు స్వభావం కలిగిన యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు రాహుల్‌ గాంధీ కీలక చర్యలు చేపడుతున్నారు. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా జాతీయ కార్యదర్శుల నియామకానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 120 మంది నాయకులను స్వయంగా ఇంటర్వ్యూ చేసి, వారి క్షేత్రస్థాయి కార్యకలాపాలు, పనితీరు, నాయకత్వ సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ సంస్థను పునరుద్ధరించి, యువతను పార్టీ ముందువరుసలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టారు. పాతతరం, ‘డ్రాయింగ్ రూమ్’ రాజకీయాలకు పరిమితం కాకుండా.. యువ, చురుకైన, క్షేత్రస్థాయిలో పనిచేసే సంస్థగా కాంగ్రెస్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో రాజకీయ సీనియారిటీ కంటే పనితీరు, ప్రజల్లో చురుకుదనం, క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

120 మంది నాయకులకు ఇంటర్వ్యూలు
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పదవుల కోసం 120 మంది నాయకులను ఇంటర్వ్యూ చేయనున్నారు రాహుల్‌… వీరిని ఒక్కో బృందంలో 10 మంది చొప్పున ఇంటర్వ్యూ చేస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. సోమవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి 30 మంది నాయకులను ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీ తన రెండు రోజుల రాయ్‌బరేలీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగనుంది.

నాయకుల గత పనితీరుపై ఆరా
ఇంటర్వ్యూలో నాయకుల గత కార్యకలాపాలు, పార్టీ కోసం చేసిన పని, వారి ప్రొఫైల్, క్షేత్రస్థాయి అనుభవం వంటి అంశాలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంటర్వ్యూకు హాజరవుతున్న నాయకుల పూర్తి ప్రొఫైల్, పనితీరు నివేదికలు ఇప్పటికే ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. కేవలం సిఫార్సులు, సిఫార్సు లేఖల ఆధారంగా కాకుండా.. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, వారి పని సామర్థ్యం ఎలా ఉంది, పార్టీ భవిష్యత్తుపై వారి దృక్పథం ఏమిటన్న అంశాల ఆధారంగా ఎంపిక చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

60 శాతానికి పైగా కార్యదర్శుల మార్పు?
కాంగ్రెస్ ప్రస్తుత జాతీయ కార్యదర్శుల్లో 60 శాతానికి పైగా మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొత్తవారికి అవకాశాలు కల్పించడం ద్వారా సంస్థలోకి కొత్త శక్తిని తీసుకురావాలన్నది పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. గతంలో పార్టీ ‘సంస్థాగత ఏర్పాటు’ కార్యక్రమం కింద పరిశీలకులుగా పనిచేసిన నాయకులకు కూడా జాతీయ కార్యదర్శి పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రం నుంచి జిల్లా స్థాయి వరకు యువతకు అవకాశం
కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొనసాగుతున్నాయి. యువ నాయకులు, క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తున్న కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కొత్త బృందాన్ని రూపొందించాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోంది.

రెండు దశాబ్దాల నాటి రాహుల్ లక్ష్యం
2004లో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి కాంగ్రెస్‌లో తరాల మార్పు, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలో కూడా గతంలో ఇంటర్వ్యూ ఆధారిత నియామక విధానాలను ప్రోత్సహించారు. ప్రతిభ ఆధారంగా యువతను ఎంపిక చేయడం ద్వారా రాజకీయ నేపథ్యం లేని వారికి కూడా నాయకత్వ అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం చేశారు.

అయితే పాతతరం నేతల నుంచి వచ్చిన వ్యతిరేకత, పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా ఈ ప్రయోగాలు తొలినాళ్లలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లో జరుగుతున్న సంస్థాగత మార్పులతో పరిస్థితి మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీనియర్ నేతల స్థానంలో కొత్త ముఖాలను తీసుకురావడం ద్వారా పార్టీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. జాతీయ కార్యదర్శుల ఎంపిక కోసం రూపొందిస్తున్న ఈ బ్లూప్రింట్‌లో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు, యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొత్త ఆలోచనలు, శక్తి, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న నాయకులతో కాంగ్రెస్ భవిష్యత్ బృందాన్ని నిర్మించాలన్నది రాహుల్ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కొత్త నాయకత్వం పార్టీ సంస్థాగత వ్యవస్థను ఎంతవరకు మార్చగలదో చూడాలి.