Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన

  • మరింత ఉధృతం అవుతున్న విద్యార్థుల ఆందోళన
  • విద్యా్ర్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం
  • ఇండియా కూటమి ప్రకటన
Rahulgandhi

Rahulgandhi

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత పెంచింది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో తన నివాసంలో ఇండియా కూటమి నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించేందుకు గాంధీ స్మృతికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనలు ఉధృతం అయ్యాయి.

విద్యార్థులు ఒంటరివారు కాదు

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. విద్యార్థుల ఉద్యమానికి ప్రతిపక్షం పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘మన విద్యార్థులు రోడ్డుపై ఉన్నారు. అందుకే ప్రతిపక్ష ఎంపీలు కూడా రోడ్డుపైనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇండియా గేట్‌కు వెళ్లాలని అనుకున్నాం. పోలీసులు అనుమతించలేదు. తర్వాత గాంధీ స్మృతికి వెళ్లాలని చెప్పినా మా బస్సును అడ్డుకున్నారు. కానీ మా సందేశం ఒక్కటే.. విద్యార్థులారా.. మేమంతా మీతోనే ఉన్నాం.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. “నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను స్మరించేందుకు, న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న సమయంలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఇండియా కూటమి ఎంపీలు గాంధీ స్మృతికి వెళ్తున్నారు. దేశ విద్యార్థులు ఒంటరివారు కాదు. వారి డిమాండ్లకు ప్రతిపక్షం పూర్తి మద్దతుగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు.

భారీ భద్రత.. బారికేడ్లు

రాహుల్ గాంధీ నివాసం దగ్గర పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోగా.. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను కూడా మోహరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యను లేవనెత్తకుండా అడ్డుకునేందుకు రాహుల్ గాంధీని గృహ నిర్బంధంలో ఉంచినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలపై చర్యలు తీసుకోవడం బదులు ప్రతిపక్షాన్ని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

సమావేశానికి హాజరైన నేతలు

రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి ఆర్జేడీ ఎంపీలు మనోజ్ ఝా, మీసా భారతి, కాంగ్రెస్ నేతలు ప్రమోద్ తివారీ, రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితరులు హాజరయ్యారు.

సమావేశానికి ముందు మనోజ్ ఝా మాట్లాడుతూ.. “జంతర్‌మంతర్‌లో దేశంలోని పలు రాష్ట్రాల్లో యువత ఆగ్రహంతో రోడ్డెక్కింది. దేశ పరిస్థితి చూసి ఆందోళన కలుగుతోంది. ఇకపై మేము ఏం చేయబోతున్నామో త్వరలో తెలుస్తుంది.” అని అన్నారు. రణదీప్ సింగ్ సుర్జేవాలా మరోసారి “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి” అని డిమాండ్ చేశారు.

సీజేపీ మరోసారి కేంద్రానికి హెచ్చరిక

ఇదే సమయంలో నీట్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోసారి విజ్ఞప్తి చేస్తూ.. “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను వెంటనే ఆమోదించండి. లేకపోతే ఉద్యమం కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆగదు.. మీ రాజీనామా వరకు వెళ్తుంది.” అని హెచ్చరించారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల కంటే ఒక విఫలమైన మంత్రికి ప్రాధాన్యం ఇస్తే ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతారన్నారు.

మళ్లీ చర్చలకు కేంద్రం ఆహ్వానం.. సీజేపీ నిరాకరణ

మరోవైపు కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానం పలికింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. గత 24 గంటల్లో విద్యార్థి ప్రతినిధులకు నాలుగు సార్లు చర్చల ఆహ్వానం పంపామని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో సమావేశానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే సీజేపీ నేతలు ఈ ప్రతిపాదనను మరోసారి తిరస్కరించారు. చర్చలు జరగాలంటే జంతర్‌మంతర్ లేదా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వంటి తటస్థ వేదికలో మాత్రమే నిర్వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.