Site icon NTV Telugu

Rahul Gandhi: “పనౌటీ” వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ‘పనౌటీ’(చెడు శకునం) వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అక్కడికి వెళ్లడం వల్లే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. మన ఆటగాళ్లు దాదాపుగా వరల్డ్ కప్ గెలిచారు, కానీ చెడు శకునం వల్ల ఓడిపోయారు అంటూ వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ఈ వ్యాఖ్యలతో ఆయన మానసిక పరిస్థితి ఏంటో తెలుస్తోందని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు పంపింది.

ఈ నెల 25న రాజస్థాన్ లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మరోమారు అధికారంలోకి రావాలని అనుకుంటుంటే, బీజేపీ కాంగ్రెస్‌ని గద్దె దించాలని ప్రచారం చేస్తోంది. ప్రధాని మోడీతో పాటు బీజేపీ కీలక నేతలు, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ వంటి వారు ప్రచారం చేస్తున్నారు.

Exit mobile version