Site icon NTV Telugu

Rahul Gandhi: బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లింది… ఒక్క నిప్పు రాజేస్తే సంక్షోభమే

Rahul

Rahul

యూకే పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు.  బీజేపీ దేశంపై కిరోసిన్ చల్లిందని… ఒక్క నిప్పు రాజేస్తే  సంక్షోభమే అని ఆయన విమర్శించారు. బీజేపీ సర్కార్ అన్నింటిని ప్రైవేట్ చేస్తోందని… ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు.

అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులను ఒకే కంపెనీ నియంత్రించాలనుకోవడం ప్రమాదకరం అని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వెల్లడించారు. దేశం ప్రమాదం అంచున ఉందని… దేశంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్  బాధ్యతాయుత్తంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు, సంఘాలు, రాష్ట్రాలు, మతాల మధ్య సామరస్యం తీసుకురావడమే కాంగ్రెస్ లక్ష్యం అని ఆయన అన్నారు. ఇండియాలో పరిస్థితులు వేడెక్కి ఉన్నాయని… వాటిని చల్లబరచాల్సి ఉందని లేకపోతే పరిస్థితులు విషమిస్తాయని ఆయన అన్నారు.

ఇండియాలో బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కుతోందని… కాంగ్రెస్ మాత్రం ప్రజల వాయిస్ వింటుందని ఆయన అన్నారు. బీజేపీ కేకలు వేయడం గొంతులు నొక్కడం చేస్తుందని… కాంగ్రెస్ మాత్రం ప్రజల వాయిస్ వింటుందని దయచేసి దేశ ప్రజలు ఇది గుర్తించాలని కోరారు. ప్రధాని ప్రజల సమస్యలు వినాలనే ఆలోచన ఉండాలని… కానీ మా ప్రధాని వినరని విమర్శించారు రాహుల్ గాంధీ. నేను చాలా మంది బ్యూరోక్రాట్లతో మాట్లాడానని… ప్రస్తుతం వారంతా ఇండియా విదేశాంగ విధానం మారిందని అంటున్నారని… అహంకారం పెరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కు ఉన్న నిర్మాణం బీజేపీ పార్టీకి కలిసి వస్తోందని… కాంగ్రెస్ కూడా అలాంటి వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Exit mobile version