దేశంలో ‘ అగ్నిపథ్’ స్కీమ్ ప్రకంపనలు రేపుతోంది. ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. బీహార్ లోని పలు జిల్లాల్లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. టైర్లను కాలుస్తూ రైల్వే ట్రాక్స్ పై పడేస్తున్నారు.
అగ్నిపథ్ స్కీమ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. అగ్ని పథ్ స్కీమ్ వల్ల యువతకు అగ్నిపరీక్ష పెట్టారని విమర్శలు చేశారు. తాజాగా ఆయన మరోసారి ఈ స్కీమ్ ను ఉద్దేశిస్తూ ప్రధానిపై విమర్శలు చేశారు.‘‘ అగ్నిపథ్ స్కీమ్ ను యువత తిరస్కరించారు, వ్యవసాయ చట్టాను రైతులు తిరస్కరించారు, నోట్ల రద్దును ఆర్థికవేత్తలు తిరస్కరించారు, జీఎస్టీని వ్యాపారులు తిరస్కరించారు, దేశ ప్రజలకు ఏం కావాలో ప్రధానికి అర్థం కావడం లేదు కాబట్టే ఆయన స్నేహితుల గొంతు తప్ప మరేమీ విపించడం లేదు’’ అంటూ ట్వీట్ చేశారు.
అగ్నిపథ్ స్కీమ్ పై విమర్శలు రావడం, ఆందోళనలు చేయడంపై కేంద్ర దిద్దుబాటు చర్యలను తీసుకుంటోంది. అగ్నిపథ్ స్కీమ్ వయోపరిమితిని పెంచింది. ఇంతకు ముందు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయోపరిమితి ఉంటే తాజాగా దీన్ని 23కు పెంచింది. మంగళవారం కేంద్రం అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకువచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు ఈ స్కీమ్ ను ప్రారంభించారు. దేశంలో 45 వేల మందిని అగ్నిపథ్ స్కీమ్ కింద ఆర్మీలోని మూడు విభాగాల్లోకి తీసుకోనున్నారు. అయితే వీరిని 4 ఏళ్ల కాలానికి మాత్రమే ఆర్మీలో ఉంచనున్నారు. రిటర్మెంట్ సమయంలో రూ.11-12 లక్షల ప్యాకేజీ ఇవ్వనున్నారు. అయితే రెగ్యులర్ ఆర్మీ వాళ్లకు ఇచ్చే పెన్షన్ వంటి సదుపాయాలను కట్ చేశారు. దీంతోనే చాలా మంది యువత ఆందోళనలు చేస్తున్నారు.