నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు ఈడీ విచారించింది. శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్‌కు సమన్లు జారీ చేయగా.. మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపును ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ఆందోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్ దగ్గర పోలీస్ భద్రత పెంచారు. అలాగే ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ ఆఫీస్‌లోకి పోలీసులు అనుమతించడంలేదు.
మరో వైపు ఈడీ విచారణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన చేపట్టింది. రాహుల్ ఈడీ విచారణ, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షను నిర్వహించింది. ఈ దీక్షలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, కె.సురేష్, వి.నారాయణస్వామి, కేసీ వేణుగోపాల్, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సాయంత్రం వరకు సత్యాగ్రహ దీక్ష చేస్తామని.. అనంతరం 5గంటలకు అగ్నిపథ్ స్కీమ్‌పై రాష్ట్రపతిని కలిసి.. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మీడియాతో వెల్లడించారు.
ఇదీ కేసు..: నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణకర్తగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2012లో ఫిర్యాదు చేశారు.