ప్రొటోకాల్ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రగడగా మారింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గ్రాండ్‌గా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు యూరోపియన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే వేడుకల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు మూడో వరుసలో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని ఆరోపించింది. ఈ సందర్భంగా 2014లో ఎల్‌కే అద్వానీ ప్రతిపక్ష నేత కాకపోయినా ముందు వరుసలో సీటు ఏర్పాటు చేసినట్లుగా అప్పటి ఫొటోను కాంగ్రెస్ విడుదల చేసింది.
ఇక సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యూరోపియన్ అతిథులతో పాటు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేంద్రమంత్రులు, వీఐపీలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం నుంచి కూడా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే మధ్యలోనే వెళ్లిపోయారు.
ఇక దీనికి కౌంటర్‌గా బీజేపీ విమర్శలకు దిగింది. ప్రతిపక్ష నాయకులను అవమానించలేదని బీజేపీ పేర్కొంది. రాహుల్‌గాంధీనే ఈశాన్య ప్రాంత పట్కా ధరించలేదని ఆరోపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరినప్పటికీ పట్కా ధరించలేదని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలపై అసహనం కారణంగానే రాహుల్ గాంధీ ఇలా చేశారని ఆరోపించింది. మోడీ, ఖర్గే సహా అందరూ పట్కా ధరించారని.. రాహుల్ గాంధీనే ధరించిలేదని పేర్కొంది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ కౌంటర్..
ఇక బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ సంగతి పక్కన పెట్టండి.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గొడవేంటి? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్రమంత్రి ఎందుకు పట్కా ధరించలేదని నిలదీసింది. ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పట్కా ఎందుకు ధరించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తోందని.. ఇది బీజేపీ మనస్తత్వం అని ధ్వజమెత్తింది.
#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi and Congress National President and Rajya Sabha LoP Mallikarjun Kharge seen at the Rashtrapati Bhavan at yesterday's 'At Home' ceremony on the occassion of the 77th Republic Day. pic.twitter.com/f7EgCGslfR
— ANI (@ANI) January 27, 2026
