Site icon NTV Telugu

Quad: భారత్‌కు దౌత్య విజయం.. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ నేతలు..

Quad

Quad

Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు. ఉగ్రదాడి నేరస్తులు, నిర్వాహకులు, ఫైనాన్షియర్లపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లో జరిగిన సంయుక్త ప్రకటనలో.. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: Jagapathi Babu : బుల్లితెరపై కొత్త అవతారంలో జగ్గూభాయ్..

‘‘పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన వారిని, నిర్వాహకులను, ఆర్థిక సహాయం చేసిన వారిని ఎటువంటి ఆలస్యం లేకుండా న్యాయం ముందు నిలబెట్టాలి. అంతర్జాతీయ చట్టం, సంబంధిత UNSCRల ప్రకారం వారి బాధ్యతలకు అనుగుణంగా, ఈ విషయంలో అన్ని సంబంధిత అధికారులతో చురుకుగా సహకరించాలని అన్ని UN సభ్య దేశాలను కోరుతున్నాము’’ అని ప్రకటన పేర్కొంది.

ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ పాల్గొన్నారు. ప్రపంచ సమస్యలు, ఉగ్రవాద నిరోధక సహకారంపై నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాదంపై ప్రపంచం ‘‘జీరో టాలరెన్స్’’తో ఉండాలని, బాధితులను, నేరస్తులను ఎప్పుడూ సమానం చూడొద్దని, ఉగ్రవాదం నుంచి తమ పౌరుల్ని రక్షించుకునే బాధ్యత భారత్‌కు ఉందని జైశంకర్ అన్నారు.

Exit mobile version