Site icon NTV Telugu

Congress Party: ఉదయ్‌పూర్‌లో కనిపించని పీవీ నరసింహారావు హోర్డింగ్

Congress Party

Congress Party

రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిర్ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పలు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేయనుంది. ఇప్పటికే ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌లంతా ఉద‌య్‌పూర్‌కు చేరుకున్నారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు నవ సంకల్ప్ శిబిర్‌కు హాజరు కానున్నారు.

కాగా ఉదయ్ పూర్‌లో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఆ పార్టీ నేతల హోర్డింగులే కనిపిస్తున్నాయి. జాతిపిత మహాత్మగాంధీ చిత్ర పటంతో పాటు జాతీయ నాయకులు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, డా.మన్మోహన్ సింగ్ చిత్రపటాలతో కూడిన హోర్డింగ్‌లను కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. అలాగే దేశ భక్తుడు రవీంద్రనాధ్ ఠాగూర్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్, సరోజినీ నాయుడు చిత్ర పటాలు కూడా ఏర్పాటు చేశారు. అటు సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, బీఆర్. అంబేద్కర్‌ చిత్రపటాలతో కూడా హోర్డింగులు కూడా దర్శనమిస్తున్నాయి.

అయితే నవ సంకల్ప్ శిబిర్‌ సందర్భంగా పీవీ నరసింహారావు చిత్ర పటం కానీ హోర్డింగ్ కానీ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేయకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2లో ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన చిత్రపటాలతో హోర్డింగులు దర్శనమిస్తున్నా.. పీవీ నరసింహారావు చిత్ర పటంతో హోర్డింగులు లేకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

Exit mobile version