Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌‌పై కీలక ప్రతిపాదన..

  • భారత్‌తో కలిసి Su-57 స్టెల్త్ ఫైటర్ అభివృద్ధికి రష్యా సిద్ధం..
  • కీలక సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి కూడా ఓకే..
  • భారత్‌ ముందు పుతిన్ కీలక ప్రతిపాదన..
Modi Putin

Modi Putin

Su-57 fighter jet: భారత వైమానిక దళం(IAF)లో 5వ తరం ఫైటర్ జెట్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఈ లోటును తాము తీరుస్తామని మిత్రదేశం రష్యా ముందుకు వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు బిగ్ ఆఫర్ ఇచ్చారు. రష్యా అభివృద్ధి చేసిన సుకోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను భారత్‌తో కలిసి అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక టెక్నాలజీని భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం భారత్ వద్ద 5వ తరం యుద్ధ విమానాలు లేవు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం 4.5 వ తరంగా భావిస్తారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాత్రం చైనా నుంచి షెన్యాంగ్ J-35A స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేసేందుకు చర్చిస్తోంది. మరోవైపు, భారత్ తన సొంత 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్సుడ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(AMCA) ప్రాజెక్టును ప్రారంభించింది, అయితే ఇది ప్రారంభ దశల్లోనే ఉంది. ఈ విమానాలు 2030 మధ్య కాలం నాటికి సేవల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఎదురవుతున్న సవాళ్లను 5వ తరం యుద్ధ విమానాలు లేకుండా భారత్ తట్టుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు ఇప్పుడు ఈ యుద్ధ విమానాలు చాలా అవసరంగా భావిస్తున్నారు.

×
×
Ad

Su-57 ఇవ్వడానికి సిద్ధం

అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన పుతిన్, భారత్‌కు రష్యా తయారీ అత్యాధునిక ఎస్‌యూ-57 విమానాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో పాటు, వాటి డెవలప్మెంట్‌లో భాగస్వామ్యం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రక్షణ రంగంలో భారత్‌తో సహకారానికి తమ వద్ద పరిమితులు లేవని ఆయన అన్నారు. ఇది పరోక్షంగా అమెరికా, పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి అన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా భారత్‌కు రక్షణ ఎగుమతులు చేస్తున్న పాశ్చాత్య దేశాలు, అత్యంత కీలకమైన సాంకేతికతను బదిలీ చేయడానికి ఆంక్షలు పెడుతున్నాయి. కానీ, రష్యా మాత్రం తమ సాంకేతికతను భారత్‌కు ఇచ్చేందుకు తయారుగా ఉంది.

2018లో ఇదే ప్రాజెక్టులో భాగం కావాలని రష్యా భారత్‌ను కోరింది. అయితే ఆ సమయంలో భారత్ u-57 స్టెల్త్ సామర్థ్యాలపై పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అంశంలోనూ విభేదాలు రావడంతో భారత్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.ఇప్పుడు ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

అమెరికా F-35 – రష్యా Su-57

5వ తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేసే విషయంలో భారత్ వద్ద రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికా తయారీ F-35, రెండోది రష్యాకు చెందిన Su-57. గతంలో ట్రంప్ F-35 డీల్‌ను భారత్ ముందు ఉంచారు. కానీ భారత్ F-35 కంటే రష్యా Su-57 బెటర్ అని భావిస్తోంది.