NTV Telugu Site icon

Punjab: శివసేన నాయకుడిపై కత్తులతో దాడి.. పట్టించుకోని జనాలు

Attck

Attck

పంజాబ్‌లో పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే శివసేన నాయకుడిపై దాడులకు తెగబడ్డారు. చుట్టూ జనం ఉన్నా.. ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శుక్రవారం లూథియానాలో రద్దీగా ఉండే వీధి మధ్యలో పంజాబ్ శివసేన నాయకుడు సందీప్ థాపర్‌పై కత్తులతో దాడి చేశారు. భద్రత కోసం సందీప్ థాపర్‌తో పాటు వచ్చిన ఒక పోలీసు కూడా అడ్డుకోలేదు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

థాపర్ ఒక ట్రస్ట్ కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి వస్తున్నారని, సిక్కులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలపై కోపంతో ‘నిహాంగ్‌లు’ అతనిపై దాడి చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించామని, త్వరలో అరెస్టు చేస్తామని లూథియానా డిప్యూటీ పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ తేజా తెలిపారు.

పంజాబ్‌లోని ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వంపై శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్‌సిమ్రత్ కౌర్ విరుచుకుపడ్డారు. ఈ సంఘటన శాంతి భద్రతల పతనాన్ని సూచిస్తోందని అన్నారు. సీఎం భగవంత్‌మాన్‌ నిద్ర నుంచి మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.