Site icon NTV Telugu

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగనున్న సిద్ధూ…

పంజాబ్ డిజిపి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటా ను తొలగించాలన్న సిధ్దూ డిమాండ్ కు ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ ఛన్ని సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొన్నిసార్లు భావావేశానికి లోనౌతారనే విషయం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తెలిసిందేనని, అర్దం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు సిధ్దూ సలహాదారు మహమ్మద్ ముస్తాఫా. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో ముఖ్యమంత్రి ఛన్ని తనను సంప్రదించలేదని, బేఖాతరు చేశారనే ఆగ్రహంతో పాటు, పంజాబ్ డిజిపి, అడ్వకేట్ జనరల్ నియామకాల పట్ల కూడా సిధ్దూ కు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. ఏఐసిసి ప్రతినిధి హరీశ్ చౌధురి తో పాటు, ముఖ్యమంత్రి ఛన్ని, సిద్ధూ తో “సమన్వయ కమిటీ” ఏర్పాటు కు అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏనాడు కాంగ్రస్ పార్టీ అధినాయకత్వాన్ని లెక్కచేయని కెప్టెన్ అమరీందర్ సింగ్ లాగా సిధ్దూ వ్యవహరించరని పేర్కొన్నారు సిద్ధూ సలహాదారు.

ఇక 2015 లో సిక్కుల మత గ్రంథం “గురు గ్రంథ సాహెబ్” ను అవమానపరుస్తూ జరిగిన వరుస సంఘటనలు, తదనంతరం ప్రజల నిరసనలు, పోలీసుల కాల్పులు తదితర పరిణామాల విచారణ పై అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తో సిధ్దూకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ సంఘటనలపై విచారణ జరిపేందుకు సహోటా నాయకత్వంలో “ప్రత్యేక దర్యాప్తు కమిటీ” ఏర్పాటు చేసింది. మొత్తానికి సిద్ధూ సూచనలు, ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి ఛన్ని అంగీకారం తెలిపారు. 2017 లో బిజేపి ని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సిద్ధూ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించారు. అది నేరవేరలేదు. ముఖ్యమంత్రి గా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో, ముఖ్యమంత్రి పదవి తననే వరిస్తుందని ఆశించి, అధిష్ఠానం ఛన్ని ని ఎంపిక చేయడంతో భంగపడ్డారు సిధ్దూ. ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ తో ఏడాది పాటు వైరం కొనసాగించిన తర్వాత సిద్ధు ను పిసిసి అధ్యక్షుడిగా నియమించింది అధిష్ఠానం. ఈ విషయంలో ప్రియాంక గాంధీ చొరవ తీసుకుని, సిద్ధు ను గట్టిగా సమర్ధించినట్లు సమాచారం.

Exit mobile version