పంజాబ్‌లో ఇటీవలే ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు కొత్త కేబినెట్‌లో ఆప్ నేత విజయ్ సింఘ్లాకు ఆరోగ్య శాఖను సీఎం భగవంత్ మాన్‌సింగ్ కట్టబెట్టారు. అయితే రెండు నెలలు తిరగకముందే మంత్రి పదవిని విజయ్ సింఘ్లా దుర్వినియోగం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ కాంట్రాక్టుల కోసం మంత్రి విజయ్ సింఘ్లా ఒక శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్ మాన్ విచారణకు ఆదేశించారు.
Navneet Rana: సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై పార్లమెంట్ కమిటీకి ఫిర్యాదు
అయితే మంత్రి అవినీతిపై వచ్చిన ఆరోపణలు రుజువు అని నిర్ధారణ కావడంతో విజయ్ సింఘ్లాను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రిపై కేసు నమోదు చేయమని కూడా పోలీసులకు సూచించినట్లు సీఎం తెలిపారు. ఈ విషయంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. తమ పార్టీ అవినీతిని అస్సలు సహించదని స్పష్టం చేశారు. అందుకే సొంత పార్టీ నేతపై అవినీతి ఆరోపణలు రాగానే చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం, నిజాయితీ కేవలం తమ పార్టీకే ఉన్నాయని ఎంపీ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి నిర్ణయమే ఢిల్లీ ప్రభుత్వంలోనూ తీసుకున్నట్లు గుర్తుచేశారు. ఇప్పుడు పంజాబ్‌లోనూ ఆప్ అటువంటి పరిపాలనే అందజేస్తుందని వివరించారు.