Punjab: ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు పంజాబ్ ను జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్.. అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మర గాలింపు.. అనుచరుల అరెస్ట్
తాజాగా అమృత్ పాల్ సింగ్ ముఖ్య సహాయకులు అయిన నలుగురిని పంజాబ్ ప్రభుత్వం అస్సాంలోని దిబ్రూగఢ్ కు తరలించింది. ప్రత్యేక వాయుసేన విమానం ద్వారా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దిబ్రూగడ్ లోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ తరలింపులో వీరితో పాటు పంజాబ్ జైళ్లశాఖ ఐజీ, మరో 30 మంది సభ్యులు ఉన్నారు. దిబ్రూఘర్ సెంట్రల్ జైలు ఈశాన్య భారతదేశంలోని పురాతన జైళ్లలో ఒకటి. అత్యంత పటిష్ట భద్రత ఉండే జైళ్లలో ఇది ఒకటి. అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదం ఎక్కువగా ఉండే సమయంలో ఉగ్రవాదులను ఇక్కడే ఉంచేవారు.
ఇదిలా ఉంటే పంజాబ్ లో భయానక వాతావరణం సృష్టించవద్దని సిక్కుల అత్యున్నత సంస్థ ‘ అకాల్ తఖ్త్’ చీఫ్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. పంజాబ్ ఇప్పటికే చాలా నష్టపోయిందని, ప్రస్తుతం అభివృద్ధి వైపు వెళ్తుందని, గతంలో పంజాబ్ గాయాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.