పుణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. మహారాష్ట్రలోనే అతి పెద్ద బస్సు డిపోల్లో పుణెలోని స్వర్గేట్ బస్సు డిపో ఒకటి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. భారీ జనసందోహం తిరిగి ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో యువతి (26)పై రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రను కుదిపేసింది. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 13 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి వేట ప్రారంభించాయి. మొత్తానికి 75 గంటల్లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
అయితే నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్లు, కుక్కలను ప్రయోగించారు. నిందితుడు పూణెలోని సమీప గ్రామంలోని ఓ చెరుకు తోటలో ఉన్నట్లుగా డ్రోన్ ద్వారా గుర్తించారు. అయితే ఈ చెరుకు తోట చాలా ఎత్తుగా ఉండడంతో అతని జాడను కనిపెట్టేందుకు ఇబ్బందిగా మారింది. అయితే నిందితుడు కుక్కల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా అతి తెలివితో చొక్కాయి మార్చుకుని వేరొక చొక్కాయి ధరించాడు. పడేసిన చొక్కాయి వాసనతో కుక్కలు నిందితుడిని వేటాడేందుకు సులువైంది. ఇక రాత్రి 10:30 గంటలకు రాందాస్.. బంధువులకు ఫోన్ చేసి వస్తు్న్నట్లు సమాచారం ఇచ్చాడు. బంధువులు కూడా అప్రమత్తమై పోలీసులను సిద్ధం చేశారు. రాత్రి 10:30 గంటలకు నిందితుడు బంధువులు ఇంటికి చేరగానే.. డాగ్‌స్క్వాడ్స్ నేరుగా ఇంటికి వెళ్లిపోయాయి. వెంటనే నిందితుడు రాందాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్వర్గేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే నిందితుడు.. ఆకలితో ఉండడంతో భోజనం కోసం బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాను పెద్ద తప్పు చేశానని.. పోలీసుల ఎదుట లొంగిపోతానని రాందాస్ బంధువులకు చెప్పినట్లు సమాచారం. రాందాస్.. ఒక వాటర్ బాటిల్‌తో బంధువుల ఇంటికి చేరాడు.
నిందితుడు రాందాస్‌కు చాలా నేర చరిత్ర ఉంది. అహల్యానగర్ జిల్లాలోని శిరూర్, శికార్‌పూర్‌తో సహా వివిధ పోలీస్ స్టేషన్లలో అతనిపై ఆరు కేసులు ఉన్నాయి. దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. 2019లో నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేశాడు. పూణె-అహల్యానగర్ మార్గంలో టాక్సీగా నడిపేవాడు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడేవాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగలు దోచుకుని వదిలివేసేవాడు. 2020లో దోపిడీ కేసులో దోషిగా తేలాడు. దీంతో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు.
ఇదిలా ఉంటే గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ తరపున ప్రచారం కూడా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ స్వర్గేట్ బస్సు డిపో దగ్గరే తిరుగుతూ ఉండేవాడు. షర్ట్, ప్యాంటు మరియు బూట్లు ధరించి నీట్‌గా తయారై కనిపించేవాడు. స్థానిక పోలీసులతో మంచి పరిచయాలు ఉండడంతో తాను పోలీస్‌నంటూ పలువురిని బెదిరించేవాడని తెలుస్తోంది. మంగళవారం ఉదయం కూడా యువతితో పోలీస్ అధికారిగానే పరిచయం చేసుకున్నట్లు సమాచారం. ‘‘సోదరీ’’.. అని పిలవడంతో ఆ యువతి అతగాడిని నమ్మేసింది. దీంతో అతడు చూపించిన బస్సు ఎక్కేసింది. ఆమె లోపలికి వెళ్లగానే డోర్ వేసేశాడు. అంతే వెంటనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బస్సులోంచి దూకేసి పారిపోయాడు. బాధితురాలు ఒక స్నేహితురాలికి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు.. వైద్య రంగంలో పని చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
ఇక ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలని డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, షిండే డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.