Pune Porsche crash: పూణేలో పోర్ష్ కార్ యాక్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మైనర్ నిందితుడు వేగంగా కారు నడిపి ఇద్దరు యువ ఐటీ నిపుణుల మరణానికి కారణమయ్యాడు. అయితే, ఈ కేసులో మైనర్ నిందితుడి తండ్రి ధనవంతుడు కావడంతో కేసులోని సాక్ష్యాలు తారుమారు చేయడం, అధికారులను ప్రభావితం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు ప్రముఖంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి బాగా తాగి ఉన్నట్లు మైనర్ పోలీసుల ముందు అంగీకరించినట్లుగా పోలీస్ వర్గాలు ఆదివారం తెలిపాయి. విచారణలో తనకు జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా గుర్తుకు రాలేదని అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసులో 17 ఏళ్ల మైనర్ తల్లిదండ్రులు శివాని అగర్వాల్, విశాల్ అగర్వాల్‌లకు పూణఏ కోర్టు అధివారం జూన్ 5 వరకు పోలీస్ కస్టడీ విధించింది. వీరిపై రక్తనమూనాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మైనర్ బాలుడి రక్తాన్ని, అతని తల్లి రక్తంతో తారుమారు చేశారు.
Read Also: Nandamuri Vasundhara: నందమూరి వసుంధర చేతుల మీదుగా మెర్సిడెస్ బెంజ్ కార్ గెలుచుకుంది ఎవరంటే..?
మే 19న పూణే కళ్యాణి నగర్‌లో మోటర్ బైక్‌పై వెళ్తు్న్న ఇద్దరు ఐటీ నిపుణలను మైనర్ నిందితుడు కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు తాగి లేడని చెప్పేందుకు రక్త నమూనాలను మార్చారు. ప్రమాదానికి ముందు సదరు టీనేజ్ అబ్బాయి పబ్‌లో మద్యం సేవిస్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వైద్య పరీక్షల కోసం అతన్ని సాసూన్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చినప్పుడు, వైద్యులు అతని తండ్రి ఆదేశాల మేరకు అతని రక్త నమూనాను అతని తల్లి రక్తంతో మార్చారు. ఇందుకోసం బాలుడి తండ్రి వైద్యులకు లంచం ఇచ్చినట్లు కూడా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అగర్వాల్ దంపతులు కుట్ర చేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త నమూనాలను తారుమారు చేయడం ద్వారా సాక్ష్యాలను నాశనం చేశారు.
ఈ ఘటనలో పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్, మైనర్ బాలుడికి మద్యం అందించినందుకు బార్‌పై రెండోది, నిందితుడి కుటుంబ డ్రైవర్‌ని ఈ కేసులో తప్పుగా ఇరికించేందుకు బలవంతం చేయడంపై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలుడి తల్లిదండ్రులతో పాటు అతని తాతని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనంగా, వారు రక్త నమూనా తారుమారు చేసినందుకు సాసూన్ జనరల్ హాస్పిటల్ నుండి ఇద్దరు వైద్యులను మరియు ఒక ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.