Site icon NTV Telugu

Avatar Mania: విద్యార్థుల అద్భుత ప్రతిభ.. ఆకులు, కొబ్బరి చిప్పలతో ‘అవతార్’ బొమ్మలు

Avatar Toys

Avatar Toys

Avatar Mania: జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కాసులు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో పాటు పిల్లలను సృజనాత్మకంగానూ ప్రేరేపిస్తోంది. తాజాగా పుదుచ్చేరికి చెందిన విద్యార్థులు కొబ్బరి చిప్పలు, ఆకుల సహాయంతో అవతార్ సినిమాలోని పాత్రల బొమ్మలను తయారుచేసి ప్రశంసలు అందుకుంటున్నారు. సెలియమేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంతోష్, నవనీత్ కృష్ణ అనే విద్యార్థులు అవతార్ సినిమాపై తమ ప్రేమను నిరూపించుకున్నారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలైన నెయిటిరి, జేక్ సుల్లీ, గ్రేట్ లియోనోప్టెరిక్స్ బొమ్మలను రూపొందించారు. అది కూడా చెత్త, అవసరం లేని సహజ వ్యర్థ పదార్థాలతో అవతార్ బొమ్మలను రూపొందించారు.

Read Also: Adani One: విమాన సేవల కోసం అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్

అవతార్ బొమ్మలను రూపొందించడానికి తమకు వారం రోజులు పట్టిందని విద్యార్థులు వెల్లడించారు. కొబ్బరి చిప్పలు, మందార ఆకులు, తాటి ఆకులు వంటి గ్రామీణ ప్రాంతాలలో సులభంగా లభించే సహజ వ్యర్థ పదార్థాల నుండి వీటిని సృష్టించడం గొప్ప విషయం అని అందరూ కొనియాడుతున్నారు. వీళ్లు రూపొందించిన బొమ్మలు అవతార్ చిత్రంలో మాదిరిగానే ఉన్నాయని ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు, స్థానికులు మెచ్చుకుంటున్నారు. గతంలోనూ ఈ విద్యార్థులు పుదుచ్చేరికి చెందిన తెలంగాణ గవర్నర్ తమిళిసై శిల్పాన్ని తయారు చేశారు. కాగా ఈనెల 16న అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతోంది.

Exit mobile version