Protests Against CAA: దాదాపుగా సుదీర్ఘ విరామం తరువాత వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్యూ) సీఏఏకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఎన్ఈఎస్ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది. దాదాపు రెండేళ్ల క్రితం సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఆ తరువాతి కాలంలో కరోనా మహమ్మారి రావడంతో పెద్దగా అల్లర్లు జరగలేదు. తాజాగా మళ్లీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు పెంచేలా కొన్ని శక్తులు కావాలనే సీఏఏ ఉద్యమాన్ని తీసుకువస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: Aa Ammayi Gurinchi Meeku Cheppali: నా ఫైరింగ్ వలనే ఇండస్ట్రీ చల్లగా ఉంది అంటున్న మహేష్ బావ
ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో సీఏఏకు వ్యతిరేకంగా 2019లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడే మళ్లీ సీఏఏ నిరసనలు ప్రారంభం అయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ నిరసనలు చేపడుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. అక్రమ వలసదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు, అస్సాం ఒప్పందాన్ని అమలు చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం( ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించుకోవాలని.. మొదలైన సమస్యలపై ఈశాన్య భారతంలో నిరసనలు జరగుతున్నాయి.
డిసెంబర్ 11, 2019న పార్లమెంట్ సీఏఏ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 కన్నా ముందుగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు.. 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించింది. అయితే ఈ చట్టంలో ముస్లింల ప్రస్తావన లేదని.. ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్డీయే ప్రభుత్వం మతపరమైన వివక్ష చూపిస్తోందని ఆందోళనలు చేశాయి. అయితే కేంద్రం మాత్రం సరిహద్దు దేశాల్లో మైనారిటీలుగా ఉండీ.. నిత్యం హింసకు గురువుతున్న వారికి ఆశ్రయం కల్పించి, పౌరసత్వం ఇవ్వాలని ఈ బిల్లును తీసుకువచ్చింది.
