Site icon NTV Telugu

Sandeshkhali: టార్గెట్ షేక్ షాజహాన్.. సందేశ్‌‌ఖాలీలో ఈడీ దాడులు..

Sandeshkhali

Sandeshkhali

Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ఘటన నిందితుడు షేక్ షాజహాన్ టార్గెట్‌గా ఈడీ ఈ రోజు భారీ దాడులు నిర్వహిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్ తర్వాత ఈడీ, పారామిలిటరీ బలగాలు ఈ రోజు నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఈడీ అధికారులు గురువారం ఉదయం 6.30 గంటలకు షేక్ షాజహాన్‌కి చెందిన ఇటుక బట్టితో పాటు ధమఖలీ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.

Read Also: Mahapanchayat: నేడు ఢిల్లీలో “మహాపంచాయత్”.. నెల రోజుల ఆందోళన తర్వాత హస్తినకు రైతులు..

రేషన్ పంపిణీ కుంభకోనాన్ని విచారించేందుకు వెళ్లిన సందర్భంలో ఈడీ అధికారులపై షేక్ షాజహాన్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి మహిళలను టార్గెట్ చేస్తూ టీఎంసీ గుండాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మహిళలు షేక్ షాజహాన్, ఇతర టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సందేశ్‌ఖాలీ పేరు మారుమోగింది. ఈ ఘటనల తర్వాత షేక్ షాజహాన్ 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా పోలీసులు అతన్ని అరెస్టు చేయవచ్చని కలకత్తా హైకోర్టు ఆదేశించిన ఒక రోజు తర్వాత బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన కేసుతో పాటు రేషన్ కుంభకోణం, మహిళలపై అత్యాచారాల కేసుల్ని సీబీఐ విచారిస్తోంది. ఈడీపై దాడి చేసిన కేసులో షేక్ షాజహాన్ ముగ్గురు అనుచరుల్ని సీబీఐ అరెస్ట్ చేసింది. కలకత్తా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అయితే, ఈ ఆదేశాలను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. మరోవైపు టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Exit mobile version