NTV Telugu Site icon

Kolkata Doctor case: సీఎం మమతకు ప్రియాంకాగాంధీ కీలక సూచన

Priyankagandhi

Priyankagandhi

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. హత్యాచారానికి గురైన తీరు మనసులను కలిచివేస్తోంది. ఇప్పటికే వైద్యులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు విధుల్లో చేరమంటూ వైద్యులు, నర్సులు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం విధించారు. ఇంకోవైపు ఈ కేసు సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ సహా విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ స్పందించారు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన కలిచివేస్తుందన్నారు. ఈ ఘటన హృదయ విదారకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత అనేది దేశంలో పెద్ద సమస్యగా మారిపోయిందని.. దీనికి సమిష్ట కృషి అవసరం ఉందని తెలిపారు. హత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాధిత కుటుంబానికి, సహచర వైద్యులకు న్యాయం చేయాలని ప్రియాంక ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికిగా సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ధ్వజమెత్తారు. హత్యాచార ఘటనతో బెంగాల్ ప్రతిష్ట మసకబారిందని వ్యాఖ్యానించారు. కోల్‌కతా అత్యాచారాల రాజధానిగా మారిపోయిందని వాపోయారు. మమత తక్కువ మాట్లాడి.. ఎక్కువ పని చేస్తే బాగుంటుందని హితవు పలికారు. వైద్యురాలి ఘటన కలిచి వేస్తోందని… నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిగా పని చేస్తే బాగుంటుందని మమతకు అధిర్ రంజన్ చౌదరి సూచించారు. ఇదిలా ఉంటే హత్యాచార ఘటనపై జరుగుతున్న ఆందోళనల్లో కాంగ్రెస్ కూడా పాల్గొంటోంది.

హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ… పోలీసులకు అల్టిమేటం విధించారు. ఆదివారంలోపు కేసును కొలిక్కి తీసుకురాకపోతే.. సీబీఐకి అప్పగిస్తానని వార్నింగ్ ఇచ్చారు.

ప్రాథమిక రిపోర్టు ఇలా..
ఇదిలా ఉంటే ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్టు.. బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేటు అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లుగా తేలినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నట్లుగా తేలింది. అయితే వైద్యురాలిని మొదట హత్య చేసి.. ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడించారు.

గురువారం అర్ధరాత్రి వరకు బాధితురాలు కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఒలింపిక్స్ గేమ్స్‌ను తన సహచరులతో చూసినట్లుగా తెలుస్తోంది. అనంతరం దాదాపు 2 గంటల ప్రాంతంలో అందరితో కలిసి డిన్నర్ చేసింది. అనంతరం చదువుకునేందుకు ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లోకి వెళ్లింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3-6 గంటల ప్రాంతంలో ఆమె హత్యాచారానికి గురై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం బాధితురాలు నగ్నంగా శవమై పడి ఉండడంతో సహచరులు భయాందోళన చెంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే దర్యాప్తుపై వస్తున్న వందతులను పోలీసులు కొట్టిపారేశారు. ఎవరూ పుకార్లు నమ్మొద్దని.. నిష్పాక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో పనిచేసిన సిబ్బందిని విచారించామని.. అలాగే సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కూడా చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసుల కస్టడీలో ఉన్నారు.

 

Show comments